Sri Lanka Head Coach : 101 టెస్టులు, 185 వన్డేలు.. అపార అనుభవజ్ఞుడికి కోచింగ్ బాధ్యతలు అప్పగించిన లంక బోర్డు

Sri Lanka Head Coach : శ్రీలంక క్రికెట్ జట్టుకు మళ్ళీ పాత వైభవం రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనతో సూపర్ 8 దశలోనే ఇంటిబాట పట్టిన లంక జట్టు, ఇప్పుడు తమ హెడ్ కోచ్‌గా ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‎ను నియమించుకుంది.

Sri Lanka Head Coach : 101 టెస్టులు, 185 వన్డేలు.. అపార అనుభవజ్ఞుడికి కోచింగ్ బాధ్యతలు అప్పగించిన లంక బోర్డు
Gary Kirsten Sri Lanka Head Coach

Updated on: Mar 09, 2026 | 8:44 PM

Sri Lanka Head Coach : శ్రీలంక క్రికెట్ జట్టుకు మళ్ళీ పాత వైభవం రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనతో సూపర్ 8 దశలోనే ఇంటిబాట పట్టిన లంక జట్టు, ఇప్పుడు తమ హెడ్ కోచ్‌గా ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‎ను నియమించుకుంది. టీమిండియాను 2011లో ప్రపంచ విజేతగా నిలిపిన ఈ మిస్టర్ కూల్ కోచ్, ఇప్పుడు శ్రీలంక జట్టుకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏప్రిల్ 15, 2026 నుంచి ఆయన తన బాధ్యతలను చేపట్టనున్నారు. సనత్ జయసూర్య రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలో కిర్‌స్టన్ రెండేళ్ల పాటు కొనసాగుతారు.

గ్యారీ కిర్‌స్టన్ అంటే కేవలం ఒక కోచ్ మాత్రమే కాదు, జట్లను శిఖరాగ్రానికి తీసుకెళ్లే ఒక వ్యూహకర్త. 2008 నుంచి 2011 వరకు భారత జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ నెగ్గడమే కాకుండా టెస్టుల్లోనూ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత తన సొంత దేశమైన సౌతాఫ్రికాకు కోచ్‌గా పనిచేసి, ఆ జట్టును మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలబెట్టారు. పాకిస్థాన్ వైట్ బాల్ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇటీవలి వరల్డ్ కప్‌లో నమీబియా జట్టుకు సలహాదారుగా వ్యవహరించిన కిర్‌స్టన్, ఇప్పుడు లంక జట్టును గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు.

ఆటగాడిగా కూడా కిర్‌స్టన్ ఒక లెజెండ్. సౌతాఫ్రికా తరపున 101 టెస్టులు ఆడి 7289 పరుగులు సాధించారు, అందులో 21 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 185 మ్యాచ్‌లు ఆడి 13 సెంచరీలతో 6798 పరుగులు చేశారు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్ అంతా కలిపి చూస్తే ఆయన ఖాతాలో ఏకంగా 64 సెంచరీలు, 26 వేల పైచిలుకు పరుగులు ఉన్నాయి. ఇన్ని దశాబ్దాల క్రికెట్ అనుభవం ఇప్పుడు శ్రీలంక జట్టుకు కొండంత అండగా మారనుంది. లంక జట్టుకు 2027 వన్డే వరల్డ్ కప్‌లో నేరుగా అర్హత సాధించేలా చేయడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం.

గత కొన్నేళ్లుగా శ్రీలంక క్రికెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. జయసూర్య పర్యవేక్షణలో జట్టు మెరుగుపడినట్లు అనిపించినా, సూపర్-8లో వరుస ఓటములు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. కిర్‌స్టన్ తన రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 2028 వరకు పదవిలో ఉంటారు. దీనివల్ల సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆయన జట్టుతోనే ఉంటారు. ఇప్పటికే మహిళల జట్టుకు జేమీ సిడన్‌ను నియమించిన లంక బోర్డు, ఇప్పుడు కిర్‌స్టన్‌ను తెచ్చి పురుషుల జట్టులో కూడా విప్లవాత్మక మార్పులు ఆశిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us