Jhulan Goswami: బాల్‌ గర్ల్‌ నుంచి లెజెండరీ క్రికెటర్‌గా.. కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడనున్న చక్దా ఎక్స్‌ప్రెస్‌

|

Sep 24, 2022 | 1:17 PM

IND W vs ENG W: టీమిండియా దిగ్గజ బౌలర్‌ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) తన కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనుంది. చారిత్మాత్రక లార్డ్స్‌ మైదానంలో నేడు ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌ తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు ఆమె వీడ్కోలు పలకనుంది.

Jhulan Goswami: బాల్‌ గర్ల్‌ నుంచి లెజెండరీ క్రికెటర్‌గా.. కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడనున్న చక్దా ఎక్స్‌ప్రెస్‌
Jhulan Goswami
Follow us on

IND W vs ENG W: టీమిండియా దిగ్గజ బౌలర్‌ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) తన కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనుంది. చారిత్మాత్రక లార్డ్స్‌ మైదానంలో నేడు ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌ తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు ఆమె వీడ్కోలు పలకనుంది. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకున్న భారత జట్టు ఇంగ్లండ్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసి ఝులన్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది. కాగా1997 ప్రపంచ కప్ ఫైనల్‌లో ‘బాల్ గర్ల్’ అయిన ఝులన్ మహిళల క్రికెట్‌లో మహారాణిగా ఎదిగింది. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తూ దిగ్గజ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2002లో అరంగేట్రం చేసిన ఝులన్ భారత్ తరఫున 12 టెస్టు మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టింది. 203 వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇవి కాకుండా 68 టీ20 మ్యాచుల్లో 56 వికెట్లు నేల కూల్చింది. అప్పుడప్పుడూ బ్యాట్‌తోనూ రాణిస్తూ వన్డేల్లో1,228 పరుగులు చేసింది.

అదొక్కటే లోటు.. అయినా..

సుమారు రెండు దశాబ్దాల పాటు టీమిండియా పేస్‌ బౌలింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచింది 39 ఏళ్ల ఝులన్‌. భారత మహిళల జట్టుకు ఎన్నో విజయాలు అందించింది. అయితే ఇంత సుదీర్ఘకాలం పాటు జట్టుకు సేవలందించినా ఆమె కెరీర్‌లో ఒక లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. అదే ప్రపంచకప్‌. రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో ఆడినప్పటికీ తన కల మాత్రం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో వీడ్కోలు మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఈ వెటరన్‌ పేసర్‌ భావోద్వేగానికి గురైంది. ‘నేను రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (2005 మరియు 2017) ఆడాను. కానీ ట్రోఫీని గెలవలేకపోయాను. ప్రపంచకప్‌ గెలవాలని ప్రతి క్రికెటర్‌ కలలు కంటాడు. అయితే ఇది నెరవేరకుండానే నేను రిటైరవుతున్నాను. ఇది నాకూలోటుగానే ఉంది. అయితే టీమిండియా జెర్సీతో సుదీర్ఘకాలం పాటు ఆడడం నాకు లభించిన గొప్ప అదృష్టం. నేను క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించినప్పుడు ఇంతకాలం పాటు ఆడతానని అసలు అనుకోలేదు. నాకు ఇదొక గొప్ప అనుభవం. టీమిండియా తరఫున ఆడడం నిజంగా నా అదృష్టం. నిజం చెప్పాలంటే నేను చాలా సాధారణ కుటుంబం చక్డా (పశ్చిమ బెంగాల్) నుంచి వచ్చాను. మా ఊర్లో మహిళల క్రికెట్ గురించి ఏమీ తెలియదు. ఇక నేను ప్రాక్టీస్ చేయడానికి లోకల్ ట్రైన్‌లో రెండున్నర గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. భారత్‌కు ఆడే అవకాశం లభించడం, మొదటి ఓవర్ బౌలింగ్ చేయడం నా బెస్ట్ మెమరీ. భారత జట్టు తరఫున మహిళల క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని ఎమోషనల్‌ అయింది ఝులన్‌.

మిథాలీతో అనుబంధం గురించి..

కాగా హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో ఝులన్‌కు మంచి అనుబంధం ఉంది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘మిథాలీ రాజ్, నేను U-19 రోజుల నుంచి కలిసి ఆడుతున్నాం. మైదానంలోనూ అలాగే బయట మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మేం భారత మహిళల జట్టును అగ్రస్థానంలోకి తీసుకెళ్లాలని భావించాం. మహిళా క్రికెట్ రూపురేఖలను మార్చాలనుకున్నాం. ప్రపంచంలోని మొదటి మూడు లేదా నాలుగు జట్లలో ఉండాలని కోరుకున్నాం . ఇందులో చాలావరకు సఫలీకృతమయ్యాం. అయితే ఇది ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ఈ ప్రయాణంలో మేం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. అయితే ఎప్పుడూ నిరాశ నిస్పృహలకు లోను కాలేదు. మా సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. జట్టు వాతావరణం ఎప్పుడూ బాగుండేది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. మేమంతా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం. నేను చాలా అదృష్టవంతుడిని. చక్దాహా నుండి వచ్చిన తర్వాత, నాకు మహిళల క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. కానీ నేను చాలా అదృష్టవంతుడిని. నాకు మొదటి నుంచి మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులు, నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు ‘ అని తెలిపిందీ లెజెండరీ క్రికెటర్‌.

కాగా భారత కాలమానం ప్రకారం శనివారం (సెప్టెంబర్‌24) మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..