క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. ప్రస్తుతం రౌండ్ 1 జరుగుతుండగా.. ఇందులో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇక వీటిల్లో 4 జట్లు సూపర్ 12కి వెళ్లనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ స్టేజిలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. బలహీనమైన జట్టు స్కాట్‌ల్యాండ్.. టీ20ల్లో ప్రపంచ నెంబర్ 6 జట్టైన బంగ్లాదేశ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌తో నాడు ‘డెలివరీ బాయ్’గా పని చేసిన ఓ ఆటగాడు.. నేడు టీ20 ప్రపంచకప్‌లో హీరోగా మారాడు. అతడెవరో కాదు స్కాట్‌ల్యాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ గ్రీవ్స్. ఆ మ్యాచ్ గురించి ఒకసారి పరిశీలిస్తే..
31 ఏళ్ల క్రిస్ గ్రీవ్స్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయకముందు అమెజాన్‌లో పార్శిల్స్ డెలివరీ చేసేవాడు. అతడి అదృష్టం ఏంటో తెలియదు గానీ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్‌లోనే టీ20 ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో ఆడే అవకాశం దక్కించుకోవడమే కాకుండా.. హీరోగా మారాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్‌ల్యాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. 53 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న స్కాట్‌ల్యాండ్ జట్టును క్రిస్ గ్రీవ్స్ బ్యాట్‌తో ఆదుకున్నాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో క్రిస్ గ్రీవ్స్.. బంగ్లాదేశ్ ప్రధాన బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు 3 ఓవర్లు వేసి 19 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. ఇక గ్రీవ్స్ తీసిన వికెట్లలో ఒకటి రహీమ్ కాగా, మరొకటి షకిబుల్ హాసన్.
ఇదిలా ఉంటే.. క్రిస్ గ్రీవ్స్ ఆల్‌రౌండ్ ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ స్కాట్‌ల్యాండ్ కెప్టెన్ కైల్ కోట్జెర్.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ”క్రిస్ గ్రీవ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు. ఇక్కడికి చేరుకోవడానికి అతడు చాలా త్యాగాలు చేశాడు. అమెజాన్‌లో పార్శిల్స్ డెలివరీ చేసేవాడు. బంగ్లాదేశ్‌పై మా విజయానికి అతడే హీరో” అని పేర్కొన్నాడు.