Yuvraj Singh : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..యువరాజ్ సింగ్ తండ్రి పై ఎఫ్‌ఐఆర్.. జైలు తప్పదా?

Yuvraj Singh : మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్‌పై చండీగఢ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. లుక్కే అనే ఒక వెబ్ సిరీస్‌లో ఆయన నటించారు. అందులోని ఒక సన్నివేశంలో ఒక మహిళా పోలీస్ అధికారిని ఉద్దేశించి ఆయన చాలా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు.

Yuvraj Singh : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..యువరాజ్ సింగ్ తండ్రి పై ఎఫ్‌ఐఆర్.. జైలు తప్పదా?
Yograj Singh

Updated on: May 15, 2026 | 7:55 AM

Yuvraj Singh : టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మహిళల పట్ల అగౌరవంగా, కించపరిచేలా మాట్లాడినందుకు చండీగఢ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఒక వెబ్ సిరీస్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చండీగఢ్‌లోని సెక్టార్ 36 పోలీస్ స్టేషన్‌లో గురువారం (మే 14) యోగరాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అసలేం జరిగింది?

యోగ్ రాజ్ సింగ్ కేవలం మాజీ క్రికెటరే కాదు, ప్రముఖ పంజాబీ నటుడు కూడా. లుక్కే అనే ఒక వెబ్ సిరీస్‌లో ఆయన నటించారు. అందులోని ఒక సన్నివేశంలో ఒక మహిళా పోలీస్ అధికారిని ఉద్దేశించి ఆయన చాలా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వీడియో క్లిప్ గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది కేవలం నటన మాత్రమే కాదని, మహిళల పట్ల ఆయనకున్న నిజమైన భావజాలానికి అద్దం పడుతోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

రంగంలోకి మహిళా కమిషన్

ఈ వీడియో పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో విషయం సీరియస్ అయ్యింది. కమిషన్ చైర్‌పర్సన్ రాజ్ కౌర్ గిల్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, యోగరాజ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సిఫార్సు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 79, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 62A కింద కేసులు నమోదు చేశారు. ఆన్‌లైన్ వేదికగా మహిళలను అవమానించడం లేదా వేధించడం వంటి చర్యల కింద ఈ సెక్షన్లను ప్రయోగిస్తారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్

యోగరాజ్ సింగ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన అనేకసార్లు నోరు జారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా టీమిండియా దిగ్గజాలు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ చర్చనీయాంశమే. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్ నాశనం కావడానికి ధోనీనే కారణమని 2015లో ఆరోపించారు. ఇక గతేడాది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్‌పై తాను గన్ గురి పెట్టానని, అక్కడికక్కడే కాల్చి చంపాలనుకున్నానని చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

కొద్ది నెలల క్రితం ఆటగాళ్ల రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ వింత ఆరోపణలు చేశారు. ఆటగాళ్లు త్వరగా రిటైర్ కావడానికి వారి భార్యలు, పిల్లలే కారణమని, మహిళలు అథ్లెట్ల కెరీర్ మధ్యలోకి రాకూడదని అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెబ్ సిరీస్ వివాదంతో ఆయన కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చండీగఢ్ పోలీసులు ఆ వైరల్ వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, తదుపరి విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us