PSL 2026: అడ్డంగా బుక్కయిన పాక్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల నిషేధం..!

PSL Ball Tampering Controversy: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. లాహోర్ ఖలందర్స్ స్టార్ ఆల్ రౌండర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామ నిర్వహించిన విచారణలో ఫఖర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది.

PSL 2026: అడ్డంగా బుక్కయిన పాక్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల నిషేధం..!
Fakhar Zaman Ban

Updated on: Mar 31, 2026 | 5:32 PM

Fakhar Zaman Ban: ఆదివారం రాత్రి కరాచీ కింగ్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో బాల్ ట్యాంపరింగ్ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే, మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంతి ఆకారాన్ని మార్చేందుకు ఫఖర్ జమాన్ ప్రయత్నించినట్లు అంపైర్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామ, ఫఖర్ పీఎస్‌ఎల్ ప్లేయింగ్ కండిషన్స్‌లోని ఆర్టికల్ 41.3ను ఉల్లంఘించారని నిర్ధారించారు.

రెండు మ్యాచ్‌ల నిషేధం..

బాల్ టాంపరింగ్ ఆరోపణలను ఫఖర్ జమాన్ మొదట తోసిపుచ్చాడు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రత్యేకంగా విచారణ నిర్వహించాల్సి వచ్చింది. ఈ విచారణలో లభించిన ఆధారాల ప్రకారం, ఫఖర్ ఉద్దేశపూర్వకంగానే బంతి కండిషన్‌ను మార్చాడని రెఫరీ స్పష్టం చేశారు. పీఎస్‌ఎల్ నియమావళి ప్రకారం, లెవల్-III నిబంధనల ఉల్లంఘన కింద ఇది తీవ్రమైన నేరంగా పరిగణించారు. తొలిసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడిన వారికి కనీసం ఒక మ్యాచ్ లేదా గరిష్టంగా రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు. ఫఖర్ విషయంలో రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ను ఖరారు చేశారు.

లాహోర్ ఖలందర్స్‌కు కోలుకోలేని దెబ్బ..

వరస వివాదాలతో సతమతమవుతున్న లాహోర్ ఖలందర్స్ జట్టుకు ఫఖర్ జమాన్ నిషేధం పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇప్పటికే కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ హోటల్ గది వివాదం, బాల్ టాంపరింగ్ పెనాల్టీలతో జట్టు ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు ప్రధాన బ్యాటర్ ఫఖర్ జమాన్ దూరం కావడం ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. నిబంధనల పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా పీఎస్‌ఎల్ గౌరవాన్ని కాపాడతామని బోర్డు ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

క్రీడా స్ఫూర్తిపై నీలినీడలు..

క్రికెట్ వంటి జెంటిల్‌మెన్ గేమ్ లో బాల్ టాంపరింగ్ అనేది అత్యంత అగౌరవమైన చర్యగా పరిగణిస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉన్న ఫఖర్ జమాన్ వంటి ఆటగాడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. గతంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుని భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఇప్పుడు ఫఖర్ జమాన్ కూడా అదే జాబితాలో చేరడం గమనార్హం.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us