
ముందున్నది భారీ లక్ష్యం.. బ్యాటర్లు ఒక్కొక్కరిగా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుతున్నారు. అయితేనేం ఓ 23 ఏళ్ల ఆల్‌రౌండర్ మాత్రం బ్యాట్‌తో తన సత్తాను చాటాడు. జట్టుకు కావాల్సినప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. కానీ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. ఇంతకీ ఆ ఆల్‌రౌండర్ మరెవరో కాదు.. మన తెలుగోడే.. విదేశీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లాండ్‌లో బ్యాట్‌తో చితక్కొట్టాడు. న్యూజిలాండ్ తరపున అరుదైన రికార్డు నమోదు చేశాడు. అతడే రచిన్ రవీంద్ర.
రచిన్ రవీంద్ర.. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో దుమ్ముదులిపిన ప్లేయర్. ఇప్పటివరకు అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. రవీంద్ర ఆడింది 9 మ్యాచ్‌లే.. కానీ అనుభవం ఉన్న ఆల్‌రౌండర్‌గా తన ప్రతిభను చాటుకున్నాడు. లండన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మిచెల్, హెన్రీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. జేమిసన్ ఒక వికెట్ తీశాడు. అయితే రచిన్ రవీంద్ర మాత్రం ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం వెన్ను విరిచాడు. సెంచరీ చేసిన మాలన్(127), రూట్(29), హ్యారీ బ్రూక్(10), మొయిన్ అలీ(3) లాంటి ఇంగ్లాండ్ కీలక బ్యాటర్ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు రచిన్ రవీంద్ర.
ఇక భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు తడబడింది. నికోలస్(41), యంగ్(24), ఫిలిప్స్(25) రెండంకెల స్కోర్ చేసినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రచిన్ రవీంద్ర మాత్రం ఎక్కడా తడబడకుండా.. 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అయితే చివరికి జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4 వికెట్లు పడగొట్టి.. తన జట్టుకు అద్భుత విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు తన ఆల్‌రౌండ్ ప్రతిభతో కివీస్ వన్డే వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
50 | @RachinRavindra follows up his career-best ODI figures with the ball with his maiden ODI half-century with the bat! NZ 211/8 (38) Follow play LIVE in NZ on Duke and @TVNZ 📺 or @SENZ_Radio 📻 LIVE scoring https://t.co/O68dfvdSYr 📲 #ENGvNZ #CricketNation pic.twitter.com/BTkKys2e0n
— BLACKCAPS (@BLACKCAPS) September 15, 2023
కాగా, రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయర్ అయినప్పటికీ.. మన తెలుగోడే. రవీంద్ర తండ్రి రవి కృష్ణముర్తి ఆంధ్రావాసి. ఆ తర్వాత ఉద్యోగరిత్యా బెంగళూరు వెళ్లారు. అనంతరం 1990వ సంవత్సరంలో ఆయన బెంగళూరు నుంచి న్యూజిలాండ్‌కు పయనమయ్యారు. ఇక అక్కడ ఆయన న్యూజిలాండ్‌లో హట్ హాక్స్ క్లబ్‌ను స్థాపించాడు. ఈ క్లబ్ ప్రతీ ఏడాది వేసవిలో ఆటగాళ్ళను భారతదేశానికి తీసుకొస్తుంది. జేమ్స్ నీషమ్, టామ్ బ్లండెల్ వంటి అంతర్జాతీయ న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఈ పర్యటనలకు వచ్చివారే. అలాగే రచిన్ రవీంద్ర కూడా గత కొంతకాలంగా ఇండియాలో ఆఫ్-సీజన్ టూర్‌లలో భాగంగా దేశవాళీ టోర్నీలు ఆడుతూ వచ్చాడు.