
Vaibhav Suryavanshi as the future voter icon for 2025 Bihar Election: భారత క్రికెట్‌కు కొత్త ఆశాకిరణంగా వెలుగొందుతున్న యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీని బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission) గౌరవించింది. 2025లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం వైభవ్‌ను ‘ఫ్యూచర్ ఓటర్ ఐకాన్’ (Future Voter Icon) గా ప్రకటించింది. యువతలో ఓటు హక్కు, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ, క్రికెట్‌లో తన ప్రతిభతో ఇటీవలే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. కాగా, 2025లో ఐపీఎల్‌లో అతను కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన (14 ఏళ్లు) సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
అంతకుముందు, అండర్-19 క్రికెట్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురి ప్రశంసలు అందుకున్నాడు. వైభవ్ ఇప్పుడు తన ఆటతీరుతోనే కాక, ఓటర్లను చైతన్యపరిచే సామాజిక బాధ్యతతోనూ వార్తల్లో నిలిచాడు.
నిజానికి, వైభవ్ సూర్యవంశీ వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ. అంటే, అతను ప్రస్తుతం ఓటు వేయడానికి అర్హుడు కాదు. అందుకే అతన్ని ‘ఓటర్ ఐకాన్’గా కాకుండా, ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ ఓటర్ ఐకాన్’గా ప్రకటించారు.
వైభవ్ సాధించిన అద్భుతమైన విజయం యువతలో అతనికి గొప్ప ఆదరణను తెచ్చిపెట్టింది. అతన్ని ఐకాన్‌గా చేయడం ద్వారా, 18 ఏళ్లు నిండకముందే ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతను, ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని యువతకు బలంగా తీసుకెళ్లాలని కమిషన్ భావించింది.
ఈ ప్రచారంతో యువతతో పాటు, సాధారణ ప్రజల్లో కూడా ఎన్నికల పట్ల ఉత్సాహాన్ని పెంచి, రాబోయే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడం లక్ష్యం.
ఎన్నికల కమిషన్ చేపట్టిన సిస్టమాటిక్ వోటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) కార్యక్రమంలో భాగంగానే ఈ ఐకాన్ నియామకం జరిగింది.
వైభవ్‌తో పాటు, ఎన్నికల కమిషన్ పలువురు ఇతర ప్రముఖులను కూడా వివిధ హోదాల్లో రాష్ట్ర ఐకాన్‌లుగా నియమించింది. వీరిలో ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ లో సెక్రటరీ జీ పాత్ర పోషించిన నటుడు చందన్ రాయ్, ఎమ్మెల్యే పాత్ర పోషించిన నటుడు పంకజ్ ఝా వంటి వారు కూడా ఉన్నారు. ఈ ప్రముఖులంతా బీహార్ ప్రజల్లో ఓటింగ్ పట్ల చైతన్యాన్ని తీసుకురావడానికి కృషి చేస్తారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..