Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ ఫైనల్ ముందు సౌత్ జోన్‌కు బిగ్ షాక్.. కెప్టెన్ తిలక్ వర్మ క్లారిటీ
Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు సౌత్ జోన్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులో లేడని కెప్టెన్ తిలక్ వర్మ స్పష్టం చేశాడు. అయితే దేవదత్ పడిక్కల్, మహమ్మద్ సిరాజ్ జట్టులోకి రావడంతో బలం పెరిగిందని తెలిపాడు. పడిక్కల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తాడని, రికీ భుయ్ ఓపెనర్‌గా కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చాడు.

Duleep Trophy 2026: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్‌తో ఆదివారం నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు సౌత్ జోన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ బిగ్ ఫైట్‌కు దూరమయ్యాడు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ శనివారం నాటి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్న కేఎల్ రాహుల్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగుతాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. సెలక్షన్ కమిటీ కూడా రాహుల్, దేవదత్ పడిక్కల్, మహమ్మద్ సిరాజ్‌లను ఆడాల్సిందిగా సూచించినట్లు కథనాలు వచ్చాయి. అయితే మ్యాచ్‌కి ముందు రోజు విలేకరులతో మాట్లాడిన సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ జట్టుతో చెన్నైలో అందుబాటులో లేరని స్పష్టం చేశాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీలతో కూడిన బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే క్రమంలో రాహుల్ లేకపోవడం సౌత్ జోన్‌కు కొంతవరకు లోటే అని చెప్పాలి.
కేఎల్ రాహుల్ సేవలు దక్కకపోయినప్పటికీ, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, అద్భుత ఫామ్‌లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తుది జట్టులోకి రావడం సౌత్ జోన్ క్యాంప్‌లో తీవ్ర ఉత్సాహాన్ని నింపింది. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో వరుస సెంచరీలతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన పడిక్కల్ రాకతో తమ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం అయిందని తిలక్ వర్మ ఆనందం వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్లుగా సిరాజ్, పడిక్కల్ తమ అనుభవాన్ని జట్టులోని యంగ్ ప్లేయర్లతో పంచుకోవడం ఫైనల్ మ్యాచ్‌లో ఎంతో ప్రయోజనకరంగా మారనుందని ధీమా వ్యక్తం చేశాడు.
తుది జట్టు స్వరూపంపై స్పష్టత ఇచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్ వన్ డౌన్ అంటే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని వెల్లడించాడు. ఇక సెమీఫైనల్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆకట్టుకున్న రికీ భుయ్, వికెట్ కీపర్ ఎన్ జగదీశన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని తెలిపారు. రికీ భుయ్ గతంలో ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉన్న ఆటగాడేనని, కొత్త బంతిని ఎదుర్కొనే నైపుణ్యం అతని వద్ద ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఈ దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే కీలక ఆటగాళ్లు టీమిండియా క్యాంప్‌లో చేరనున్నారు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెప్టెంబర్ 13 నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం జాతీయ జట్టుతో జతకట్టనున్నారు. రెడ్ బాల్ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో వీరి భాగస్వామ్యం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుమతితోనే సాధ్యపడిందని సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
