T20 World Cup 2026 : భయమైతే రాకండి.. వచ్చి తన్నులు తినడం అవసరమా?.. పీసీబీ చైర్మన్ బెదిరింపులపై భారత్ ఫైర్

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ముంగిట భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ యుద్ధం ముదురుతోంది. ఒకవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ "మేము వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటాం" అని బెదిరింపులకు దిగుతుంటే, దానికి టీమిండియా మాజీ దిగ్గజం క్రిష్ణమాచారి శ్రీకాంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

T20 World Cup 2026 : భయమైతే రాకండి.. వచ్చి తన్నులు తినడం అవసరమా?..  పీసీబీ చైర్మన్ బెదిరింపులపై భారత్ ఫైర్
Mohsin Naqvi

Updated on: Jan 28, 2026 | 1:20 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా భారత్, శ్రీలంక జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో, దానికి మద్దతుగా పాకిస్థాన్ కూడా భారత్‌లో ఆడేందుకు విముఖత చూపుతోంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత్‌కు వెళ్తామని, లేదంటే టోర్నీని బహిష్కరిస్తామని సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ సెలెక్టర్, 1983 వరల్డ్ కప్ హీరో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు.

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన శ్రీకాంత్.. పాకిస్థాన్ ఆటతీరును, వారి బోర్డు తీరును ఏకిపారేశారు. “ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న విధ్వంసకర బ్యాటింగ్‌ను చూసి పాకిస్థాన్ భయపడుతోంది. గత మ్యాచ్‌ల్లో కేవలం 10 ఓవర్లలోనే 150 పరుగులు బాదుతున్నారు. ఇలాంటి పవర్ హిట్టింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. కొలంబోలో మనోళ్లు సిక్స్ కొడితే అది నేరుగా చెన్నైలో పడాలి.. అంతలా కొడుతున్నారు. మీకు అంత భయం వేస్తుంటే రాకండి, ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. వస్తే మాత్రం టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోవడం ఖాయం” అని ఎద్దేవా చేశారు.

మరోవైపు పాకిస్థాన్ బోర్డు ద్వంద్వ వైఖరిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు టోర్నీ నుంచి తప్పుకుంటామని నఖ్వీ స్టేట్‌మెంట్లు ఇస్తుంటే, మరోవైపు పీసీబీ హడావిడిగా వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టును ప్రకటించింది. అయితే ఈ స్క్వాడ్ ప్రకటించినా కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఇండియాకు వెళ్లడంపై స్పష్టత లేదని మేనేజ్మెంట్ చెబుతోంది. అంటే పాకిస్థాన్ కేవలం భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం, పీసీబీ చైర్మన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ నిజంగానే రాకపోతే ఐసీసీ నుంచి భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే శ్రీకాంత్ వంటి మాజీలు మాత్రం పాక్ బెదిరింపులను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, టీమిండియా తన విశ్వరూపాన్ని మైదానంలో చూపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సింపుల్ ల్యాంగ్వేజీలో చెప్పాలంటే.. “ఆట చేతకాక, ఓడిపోతామనే భయంతోనే పాక్ ఇలాంటి సాకులు వెతుకుతోంది” అన్నదే శ్రీకాంత్ మాటల సారాంశం.