Devon Conway : ఐపీఎల్ వేలంలో అవమానం..రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

Devon Conway : సౌతాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‎గా మిగిలిపోయిన కాన్వే, ఆ కసిని బ్యాట్‌తో చూపించాడు.

Devon Conway : ఐపీఎల్ వేలంలో అవమానం..రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
Devon Conway

Updated on: Dec 27, 2025 | 9:46 AM

Devon Conway : సౌతాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‎గా మిగిలిపోయిన కాన్వే, ఆ కసిని బ్యాట్‌తో చూపించాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన ఆయన, ఎంఐ కేప్ టౌన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తనపై నమ్మకం ఉంచని ఐపీఎల్ జట్లకు తన పవర్ ఏంటో చూపిస్తూ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే తన మార్క్ ఇన్నింగ్స్‌తో హోరెత్తించాడు. మొత్తం 64 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (40)తో కలిసి తొలి వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి డర్బన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఐపీఎల్‌లో 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన కాన్వేను ఎవరూ తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున గతంలో అదరగొట్టిన కాన్వే, ఇప్పుడు తన ఫామ్‌తో అందరి నోళ్లు మూయించాడు.

ఈ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులోని టాప్-6 బ్యాటర్లందరూ 20కి పైగా పరుగులు చేసి సత్తా చాటారు. ఎంఐ కేప్ టౌన్ బౌలర్లలో జార్జ్ లిండే రెండు వికెట్లు తీసినప్పటికీ, పరుగులను మాత్రం కట్టడి చేయలేకపోయాడు. 233 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ కేప్ టౌన్ జట్టులో రయాన్ రికెల్టన్ (113) మెరుపు సెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.

చివరి ఓవర్లో ఎంఐ కేప్ టౌన్ విజయానికి 22 పరుగులు అవసరం కాగా, కేవలం 6 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో డర్బన్ సూపర్ జెయింట్స్ 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇటు కాన్వే మెరుపులు, అటు రికెల్టన్ సెంచరీతో అభిమానులకు పసందైన క్రికెట్ వినోదం దక్కింది. ఐపీఎల్ వేలంలో దక్కని గుర్తింపును, గ్రౌండ్‌లో తన బ్యాట్‌తో సాధించి కాన్వే తన విలువను మరోసారి చాటిచెప్పాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..