IPL 2021: వెస్టిండీస్ ఆటగాళ్ల రాకకు మార్గం సుగమం.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!

|

Jun 18, 2021 | 3:54 PM

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల రాకకోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

IPL 2021: వెస్టిండీస్ ఆటగాళ్ల రాకకు మార్గం సుగమం.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!
Ipl 2021
Follow us on

IPL 2021: ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల రాకకోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ రిక్వెస్ట్ మేరకు సీపీఎల్ (కరీబియన్ ప్రీమియర్ లీగ్) షెడ్యూల్‌ను మార్చేందుకు విండీస్ క్రికెట్ బోర్డు అంగీకారం తెలిపిందంట. సీపీఎల్ ను వారం నుంచి పది రోజులు ముందుకు జరపనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీసీసీఐ పంతం నెగ్గించుకుంది. భారత్‌ లో కోవిడ్-19 వల్ల ఐపీఎల్‌ 2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడింది. మిగతా మ్యాచ్‌లను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. 29 మ్యాచ్‌లు పూర్తవ్వగా, ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటికోసం యూఏఈ ని ప్లాన్ చేసింది బీసీసీఐ. 2020 లోనూ అక్కడే ఐపీఎల్‌ను నిర్వహించింది. దీంతో మరోసారి బీసీసీఐ చూపు యూఏఈ పై పడింది. అయితే ఇదే సమయంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ద్వైపాక్షిక సిరీసులు ఆడనున్నాయి. దీంతో ఆయా దేశాల క్రికెటర్లు ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు హాజరయ్యే అవకాశం లేదు. జట్టుకు ఎంపిక కాని వాళ్లు మాత్రమే ఐపీఎల్ లో ఆడనున్నారు. అంటే ప్రముఖ ఆటగాళ్లు లేకుండానే ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఎలాగైన కొంతమంది విదేశీ ఆటగాళ్లనైనా ఆడించాలనే పంతంతో ఉంది. ఈమేరకు పలు దేశాలతో సంప్రదింపులుచేస్తోంది.

వెస్టిండీస్‌ కు ఎలాంటి సిరీస్‌లు లేవు. కానీ, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు సీపీఎల్‌ నిర్వహించేందుకు బోర్డు ప్లాన్ చేస్తోంది విండీస్ బోర్డు. దీంతో బీసీసీఐ కోరిక మేరకు సీపీఎల్ లో తేదీల్లో మార్పులు చేసేందుకు విండీస్ బోర్డు ఒప్పుకుంది. మొదట్లో ససేమిరా అన్నా.. తాజాగా విండీస్‌ బోర్డు సీపీఎల్‌ను ముందుకు జరిపేందుకు అంగీకరించింది. దీంతో క్రిస్‌గేల్‌, డ్వేన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌, జేసన్‌ హోల్డర్‌, ఆండ్రీ రసెల్‌ లాంటి ప్రముఖ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడేందుకు రానున్నట్లు తెలుస్తోంది.