Cheteshwar Pujara: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మార్చి నుంచి ఇంగ్లండ్‌లోనే ఉన్న మన నయావాల్.. ససెక్స్ తరఫున సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టేస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ పుజారా 2 డబుల్ సెంచరీలతో సహా మొత్తం 5 సెంచరీలు బాదేశాడు. ఇప్పుడు వన్డే టోర్నమెంట్‌లోనూ తన సూపర్‌ఫామ్ కొనసాగిస్తున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో వరుసగా రెండు శతకాలు నమోదుచేశాడు. నాలుగు రోజుల క్రితం వార్విక్‌షైర్‌పై 79 బంతుల్లో 107 పరుగులు చేసిన పుజారా…ఆదివారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో అంతకుమించి అనేలా చెలరేగి పోయాడు. కేవలం 131 బంతుల్లో 174 రన్స్ సాధించి త్రుటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండడం విశేషం. కాగా ఇన్నింగ్స్ చివర్లో ఔటై పెవిలియన్‌కు తిరిగి వస్తున్న నయావాల్ ను ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇదే సమయంలో పుజారా నాలుగేళ్ల కుమార్తె కూడా మ్యాచ్‌ను చూస్తూ తెగ సంబరపడిపోయింది. తన తండ్రిని అభినందిస్తూ డ్యాన్స్ చేస్తూ చప్పట్లు కొట్టింది.
తన గారాల పట్టికి సంబంధించిన వీడియోను పుజారా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది . ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. పుజారాతో పాటు టామ్ క్లార్క్ (104) సెంచరీతో మెరిశాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 రన్స్ కే కుప్పకూలింది. దీంతో 216 పరుగుల భారీ తేడాతో ససెక్స్ విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..