ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 216 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు పరిస్థితిని చెడగొట్టే విధంగా సిక్సర్ల వర్షం కురిపించిన రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే అద్భుతాలు చేస్తూ, విజయంతోపాటు అనేక రికార్డులను నెలకొల్పారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు మెరుగైన ఆరంభం లభించకపోవడంతో కేవలం 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబే, రాబిన్ ఉతప్ప ఏడో ఓవర్ నుంచి జట్టుకు ఆయువు పట్టులా మారారు. ప్రారంభంలో, ఇద్దరూ కొంత సమయం పాటు నెమ్మదిగా ఆడారు. సింగిల్స్ తీస్తూ, కీలక భాగస్వామ్యాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టారు.
ఇన్నింగ్స్ 10 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 2 వికెట్ల నష్టానికి కేవలం 60 పరుగులు చేసింది. కానీ, ఆ తర్వాత ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు గేర్ మార్చడంతో బెంగళూరు బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. చివరి పది ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 156 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో చివరి పది ఓవర్లలో సాధించిన మూడో అతిపెద్ద స్కోరుగా ఇది నిలిచింది.
అదే సమయంలో, శివమ్ దూబే, రాబిన్ ఉతప్పల మధ్య మొత్తం 165 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇది ఐపీఎల్‌లో 3వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.
శివమ్ దూబే-రాబిన్ ఉతప్ప కీలక భాగస్వామ్యం..
74 బంతులు, 165 పరుగులు, 17 సిక్సర్లు (ఉతప్ప-9, శివమ్-8)
11-20 ఓవర్లలో అత్యధిక పరుగుల రికార్డు..
• 172 పరుగులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ లయన్స్, 2016
• 162 పరుగులు, పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్, 2014
• 156 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022
• 155 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్, 2010
చెన్నై సూపర్ కింగ్స్ తరపున భారీ భాగస్వామ్యం..
• 181* షేన్ వాట్సన్- ఫాఫ్ డు ప్లెసిస్ vs పంజాబ్ కింగ్స్, 2020
• 165 రాబిన్ ఉతప్ప- శివం దూబే vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022
• 159 మురళీ విజయ్- మైక్ హస్సీ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2011
చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోర్స్..
• 95(నాటౌట్) శివమ్ దూబే Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2022
• 95 మురళీ విజయ్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2011
ఈ అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై ఇన్నింగ్స్ 216 పరుగులు చేరింది. బెంగుళూరు జట్టు 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరికి చెన్నై 23 పరుగుల తేడాతో, లీగ్‌లో తన తొలి విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది తొలి విజయం కాగా, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సీఎస్‌కే ఈ విజయాన్ని అందుకుంది.