Video: ఓరి మీ దుంపల్ తెగ.. మైదానం ఇలా సాప్ సపాయి చేస్తారేంట్రా బాబు! PCB ఏకిపారేస్తున్న నెటిజన్లు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మైదాన డ్రైనేజీ సమస్యలతో మ్యాచ్ పునఃప్రారంభం కాకపోవడంతో పాక్ మైదానాల నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరుకోగా, ఆఫ్ఘనిస్తాన్ తన అవకాశాలను ఇంగ్లాండ్ గెలుపుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా మూడు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో, టోర్నమెంట్‌పై అసంతృప్తి పెరిగింది. 

Video: ఓరి మీ దుంపల్ తెగ.. మైదానం ఇలా సాప్ సపాయి చేస్తారేంట్రా బాబు! PCB ఏకిపారేస్తున్న నెటిజన్లు
Pakistan Cricket Stadium

Updated on: Mar 01, 2025 | 5:49 PM

లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛేజింగ్ చేస్తున్న సమయంలో వర్షం ప్రారంభమైంది. 30 నిమిషాలపాటు కుండపోత వర్షం కురియడంతో మైదానం పూర్తిగా తడిసిపోయింది. వర్షం ఆగిన తర్వాత కూడా గ్రౌండ్ సిబ్బంది చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, మైదానం ఆడటానికి అనువుగా మారలేదు. దీంతో ఆటను వదిలివేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌ల సంఖ్య ఇప్పటికే మూడు కావడంతో, పాకిస్తాన్‌లోని మైదానాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి.

మైదానాన్ని పొడిగా చేయడానికి మాప్‌లు, స్పాంజ్‌లు వాడినా, గంట సేపు శ్రమించినప్పటికీ ఉపరితలం తడిగా ఉండిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించేందుకు నిశ్చయించలేకపోయారు. అయితే మైదానం సిద్దం చేసేందుకు సిబ్బంది నానా తిప్పలు పడుతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

మ్యాచ్ రద్దుతో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు, ఆఫ్ఘనిస్తాన్ ఆశలపై ఆవరించిన మేఘాలు

ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరికీ చెరో పాయింట్ లభించింది. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది.

మ్యాచ్ రద్దవడానికి ముందు, ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ నిలకడగా రాణించింది. సెదికుల్లా అటల్ (85) మరియు అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) అర్థశతకాలు సాధించడంతో 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ 47 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలా రెండు వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో, ట్రావిస్ హెడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 40 బంతుల్లో 59 పరుగులు చేశాడు. 12.5 ఓవర్లలో ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 109 పరుగులు చేసిన తర్వాత వర్షం ఆటను నిలిపివేసింది.

పాకిస్తాన్ మైదానాల నిర్వహణపై తీవ్ర విమర్శలు

మ్యాచ్ రద్దు వెనుక ప్రధాన కారణంగా పాకిస్తాన్ మైదానాల అసంతృప్తికర పరిస్థితులను అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు విమర్శించారు. మైదానాల డ్రైనేజీ వ్యవస్థ తగినంత ప్రభావవంతంగా లేకపోవడం, గ్రౌండ్ సిబ్బంది వర్షం తర్వాత త్వరగా మైదానాన్ని సిద్ధం చేయడంలో విఫలమవ్వడం ప్రధాన సమస్యలుగా చెప్పుకొస్తున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో, పాక్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇప్పుడు టోర్నమెంట్‌లో సెమీఫైనల్ బెర్తుల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధించగా, మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ కొనసాగుతోంది. మరి ఆఫ్ఘనిస్తాన్‌కు అదృష్టం కలిసొస్తుందా లేదా అనేది ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.