
Harmanpreet Kaur : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ముంబైకి ఇది అత్యంత భారీ ఛేదన కావడం విశేషం. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్ రేసులో తన పట్టును మరింత బిగించగా, గుజరాత్ ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ(33) ఆరంభంలోనే ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. కనికా అహూజా(35) మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరిగెత్తించింది. చివర్లో జార్జియా వేర్హామ్(43 నాటౌట్), భారతి ఫుల్మాలి(36 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా భారతి కేవలం 15 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో విరుచుకుపడటంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. చివరి మూడు ఓవర్లలోనే గుజరాత్ ఏకంగా 49 పరుగులు రాబట్టింది.
లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యతాయుతంగా ఆడింది. అమంజోత్ కౌర్(40)తో కలిసి నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించి ముంబైని రేసులోకి తెచ్చింది. ఈ క్రమంలో హర్మన్‌ప్రీత్ డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. గుజరాత్ ఫీల్డర్లు ఆమె ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేయడం ముంబైకి కలిసొచ్చింది.
అమన్జోత్ అవుట్ అయిన తర్వాత నికోలా కేరీ(37 నాటౌట్) హర్మన్‌ప్రీత్‌కు అద్భుతమైన సహకారం అందించింది. వీరిద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే బౌండరీల వర్షం కురిపించారు. వీరి మధ్య 43 బంతుల్లోనే 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదైంది. దీంతో ముంబై మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. పక్కా ప్లానింగ్‌తో ఆడిన హర్మన్‌ప్రీత్ తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..