
Brian Lara Warns on Gambhir Coaching: భారత క్రికెట్ ప్రస్తుత స్థితిపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చేసిన సంచలన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో చర్చకు దారితీశాయి. టీం ఇండియా కేవలం టీ20 క్రికెట్ లోనే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని, ఆ విజయాలు కూడా వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడి ఉన్నాయని, జట్టు సమిష్టి కృషి ఫలితం కాదని లారా అభిప్రాయపడ్డారు. ఈ ధోరణి 2026 టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలలో భారత జట్టుకు ప్రమాదకరంగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో విఫలమైతే, కీలక మ్యాచ్ లలో ఓటమి తప్పదని లారా స్పష్టం చేశారు.
బీబీసీ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బ్రియాన్ లారా టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గంభీర్ తీసుకుంటున్న యాదృచ్ఛిక నిర్ణయాలు భారత క్రికెట్ కు సరికాదని, అవి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. గౌతమ్ గంభీర్ హయాంలో భారత జట్టు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో ప్రదర్శన పూర్తిగా దిగజారిందని లారా మండిపడ్డారు. ఒకప్పుడు భారత్ గడ్డపై గెలవాలంటే ప్రత్యర్థి జట్లు వంద రకాల వ్యూహాలతో రావాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు ఏ జట్టు వచ్చినా భారత్ ను వైట్ వాష్ చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి భారత క్రికెట్ కు తీవ్ర ప్రమాదకరమని లారా పేర్కొన్నారు.
భారత క్రికెట్ ను కాపాడాలంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెంటనే గౌతమ్ గంభీర్ ను కోచింగ్ సెటప్ నుంచి తప్పించాలని బ్రియాన్ లారా గట్టిగా సిఫార్సు చేశారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే భారత క్రికెట్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. లారా వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే కోచింగ్ నిర్ణయాలు, జట్టు ఎంపికలపై విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్ పై ఈ వ్యాఖ్యలతో ఒత్తిడి మరింత పెరిగింది. ఈ పరిణామాలపై గౌతమ్ గంభీర్ ఎలా స్పందిస్తారో చూడాలి. బ్రయాన్ లారా వంటి దిగ్గజం నుంచి వచ్చిన ఈ హెచ్చరికలు భారత క్రికెట్ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..