IPL 2025: ఇకపై కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌..? ఆ నిషేధంపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన..

|

Oct 25, 2024 | 12:06 PM

David Warner: 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో డేవిడ్ వార్నర్ శాండ్‌పేపర్ గేట్ కుంభకోణం కారణంగా జీవితకాల నాయకత్వ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీంతో కెప్టెన్‌గా మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

IPL 2025: ఇకపై కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌..? ఆ నిషేధంపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన..
David Warner
Follow us on

David Warner: ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన డేవిడ్ వార్నర్‌కు ఆరేళ్ల తర్వాత పెద్ద ఊరట లభించింది. 2018 సంవత్సరంలో శాండ్ పేపర్ కుంభకోణం కారణంగా, క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్‌పై ఏ స్థాయిలోనైనా జట్టుకు కెప్టెన్‌గా ఉండకుండా జీవితకాల నాయకత్వ నిషేధాన్ని విధించింది. కానీ, ఇప్పుడు అతను దీని నుంచి ఉపశమనం పొందాడు. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక అడుగు వేసింది. అతని నాయకత్వంపై జీవితకాల నిషేధాన్ని తొలగించింది. అయితే వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. ఈ నిషేధాన్ని ఎత్తివేయడంతో, అతను రాబోయే BBL సీజన్‌లో సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం చూడవచ్చు.

డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట..

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన వార్నర్ ఈ నెల ప్రారంభంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ ముందు హాజరైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలియజేసింది. అసలు పరిమితుల నిబంధనలను సవరించడం కోసం అతను తన వాదనను సమర్పించాడు. అలాన్ సుల్లివన్, జేన్ సీరైట్, జెఫ్ గ్లీసన్‌లతో కూడిన ప్యానెల్ ఏకగ్రీవంగా వార్నర్ 2018 నిషేధాన్ని ఎత్తివేసేందుకు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించింది.

వార్నర్‌పై జీవితకాల నాయకత్వ నిషేధం ఎత్తివేత..

వార్నర్ ప్రతిస్పందనలను విన్న తర్వాత, ప్యానెల్‌లోని సభ్యులందరూ అతని ప్రవర్తనకు బాధ్యత వహించడంలో నిజాయితీగా ఉన్నట్లు గుర్తించారు. అతను తన చర్యలకు తీవ్రంగా సిగ్గుపడుతున్నాడు. పశ్చాత్తాపం చెందుతున్నాడు. నిషేధం తర్వాత అతని ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంది. తనలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు వార్నర్ మళ్లీ అలాంటి ఘటనలో ప్రమేయం ఉండదని ప్యానెల్ పూర్తిగా సంతృప్తి చెందింది.

శాండ్ పేపర్ కుంభకోణం ఏమిటి?

2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు బంతిని రుద్దడానికి (బాల్ టెంపరింగ్) శాండ్ పేపర్‌పే ఉపయోగించారు. ఈ ఘటన కెమెరాలో చిక్కింది. ఇందులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ దోషులుగా తేలారు. ఈ ఘటన కారణంగా స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం పడింది. కామెరాన్ 9 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..