
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో ప్రయోగాలకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) తుది జట్టులో కొనసాగుతాడా? అనే చర్చ మొదలైంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన భువీ.. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్న అతడు.. ఓవర్‌కు 11.58 పరుగుల చొప్పున ఇచ్చాడు.
ఈ పరిస్థితిపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. భువనేశ్వర్ బౌలింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే అతడి స్థానంలో స్పిన్నర్ లేదా మయాంక్ యాదవ్ (Mayank Yadav) వచ్చే అవకాశం ఉందని అశ్విన్ పేర్కొన్నాడు.
“భువీ బౌలింగ్ చేసిన విధానం చూస్తే అతడి స్థానంలో స్పిన్నర్ లేదా మయాంక్ యాదవ్ రావచ్చు. అలా జరిగితే నేను ఆశ్చర్యపోను” అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు మైదానాల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. తొలి రెండు మ్యాచ్‌లు పెద్ద మైదానాల్లో జరిగాయని, అక్కడ స్పిన్నర్లను ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాడు. మూడో టీ20లో న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారని గుర్తుచేశాడు.
ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు చిన్న మైదానాల్లో జరగనున్న నేపథ్యంలో స్పిన్నర్లను ఎక్కువగా ఆడిస్తారా అనే విషయంలో కూడా సందేహం ఉందని అశ్విన్ పేర్కొన్నాడు.
మయాంక్ యాదవ్ తొలి టీ20లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతడి గణాంకాలు భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) కంటే మెరుగ్గా ఉన్నాయి. అయితే ఆ తర్వాత అతడి స్థానంలో ప్రిన్స్ యాదవ్ (Prince Yadav)కు అవకాశం లభించింది. ప్రిన్స్ గత రెండు మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలు అందించాడు.
మరోవైపు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత్ సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకోవడంతో చివరి రెండు టీ20ల్లో ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
భువనేశ్వర్‌కు ఇప్పుడు సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు కీలకంగా మారాయి. తన అనుభవం, డెత్ ఓవర్లలో యార్కర్లతో తిరిగి ప్రభావం చూపగలిగితే తుది జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే టీమ్ మేనేజ్‌మెంట్ యువ పేసర్ల వైపు మొగ్గు చూపే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..