SA20 2025-26 : బ్యాట్స్ మెన్ల బాదుడు.. బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్ లో 449 పరుగులు..ఫ్యాన్స్‎కి పూనకాలు

SA20 2025-26 : సౌతాఫ్రికాలో జరుగుతున్న SA20(2025-26) లీగ్ నాలుగో సీజన్ అదిరిపోయే రేంజ్‌లో మొదలైంది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్ టౌన్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో ఏకంగా 449 పరుగులు నమోదయ్యాయి.

SA20 2025-26 : బ్యాట్స్ మెన్ల బాదుడు.. బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్ లో 449 పరుగులు..ఫ్యాన్స్‎కి పూనకాలు
Sa20 2025 26

Updated on: Dec 27, 2025 | 8:04 AM

SA20 2025-26 : సౌతాఫ్రికాలో జరుగుతున్న SA20(2025-26) లీగ్ నాలుగో సీజన్ అదిరిపోయే రేంజ్‌లో మొదలైంది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్ టౌన్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో ఏకంగా 449 పరుగులు నమోదయ్యాయి. ఎంఐ కేప్ టౌన్ ఓపెనర్ రయాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ సీజన్ లోనే మొదటి సెంచరీ బాదినప్పటికీ, దురదృష్టవశాత్తూ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (64), కేన్ విలియమ్సన్ (40) తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రామ్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ వీస్ వంటి హిట్టర్లు తలో చేయి వేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఎంఐ కేప్ టౌన్ బౌలర్లలో జార్జ్ లిండే రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ కేప్ టౌన్ ఆరంభంలోనే తడబడింది. రీజా హెండ్రిక్స్ (28), వాన్ డర్ డస్సెన్ (2), నికోలస్ పూరన్ (15) తక్కువ స్కోర్లకే అవుట్ అవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ రయాన్ రికెల్టన్ మాత్రం మొండిగా పోరాడాడు. కేవలం 63 బంతుల్లోనే 113 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఏకంగా 11 సిక్సర్లు ఉన్నాయి. SA20 చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే రికార్డు. చివర్లో జేసన్ స్మిత్ (14 బంతుల్లో 41) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.

చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఎంఐ కేప్ టౌన్ గెలవాలంటే భారీ పరుగులు కావాల్సిన సమయంలో డర్బన్ యువ బౌలర్ ఈథన్ బాష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. క్వేనా మఫాకా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎంఐ కేప్ టౌన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల వద్దే ఆగిపోయింది. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న డర్బన్ జట్టు, ఈసారి అద్భుత విజయంతో బోణీ కొట్టి తన సత్తా చాటింది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..