BCCI : రెడ్ బాల్ క్రికెట్‌కు మంచి రోజులు.. వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సరికొత్త టోర్నీ

BCCI : టెస్ట్ క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు బీసీసీఐ, వీవీఎస్ లక్ష్మణ్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. జూన్, జూలై నెలల్లో భారీ ఇంట్రా-COE టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 64 మంది అత్యంత ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు పాల్గొంటారు.

BCCI : రెడ్ బాల్ క్రికెట్‌కు మంచి రోజులు.. వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సరికొత్త టోర్నీ
Vvs Laxman

Updated on: Apr 05, 2026 | 8:14 AM

BCCI : భారత టెస్ట్ జట్టు ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్న వరుస ఓటములు, డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోవడం వంటి పరిణామాలు బీసీసీఐని ఆలోచనలో పడేశాయి. కేవలం టీ20లు, వన్డేలకే పరిమితం కాకుండా, అత్యంత కఠినమైన టెస్ట్ క్రికెట్‌లో మళ్ళీ భారత్ నంబర్ వన్ కావాలని బోర్డు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో ఒక స్పెషల్ రోడ్ మ్యాప్ తయారైంది. కేవలం సీనియర్లే కాకుండా, అండర్-19, అండర్-25 స్థాయి నుంచే రెడ్ బాల్ క్రికెట్ పై పట్టు సాధించేలా చర్యలు చేపట్టనున్నారు.

ఈ ప్లాన్‌లో భాగంగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే జూన్, జూలై నెలల్లో భారీ ఇంట్రా-COE టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 64 మంది అత్యంత ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు పాల్గొంటారు. వీరి వయస్సు 25 ఏళ్ల లోపు ఉంటుంది. 4 రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌లలో నిలకడగా రాణించే వారిని గుర్తించి, భవిష్యత్తులో టీమిండియా టెస్ట్ జట్టుకు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేయనున్నారు. నేషనల్ సెలక్టర్లు కూడా ఈ టోర్నీని నిశితంగా గమనించాలని, టెస్ట్ ఫార్మాట్ కు సరిపోయే ఆటగాళ్ల జాబితా తయారు చేయాలని బోర్డు ఆదేశించింది.

అంతర్జాతీయ అనుభవం కోసం అండర్-19, అండర్-25 జట్లను శ్రీలంక పర్యటనకు పంపాలని కూడా బీసీసీఐ నిర్ణయించింది. ఇటీవల ఆయుష్ మ్హాత్రే కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టు, శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో అద్భుతమైన ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చిన్న వయస్సు నుంచే రెడ్ బాల్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచడం ద్వారా, సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టు పట్టు కోల్పోకుండా ఉండాలనేది లక్ష్మణ్ టీమ్ ప్రధాన ఉద్దేశం.

భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత 5 టెస్ట్ సిరీస్‌లలో కేవలం ఒక్కదానిలో మాత్రమే విజయం సాధించడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో యువ రక్తాన్ని ఎక్కించడం ద్వారా జట్టును మళ్ళీ గాడిలో పెట్టవచ్చని బోర్డు భావిస్తోంది. వైట్ బాల్ క్రికెట్ ఇచ్చే గ్లామర్ కి అలవాటు పడిన కుర్రాళ్లను, మళ్ళీ రెడ్ బాల్ క్రికెట్ వైపు మళ్లించడమే ఈ కొత్త టోర్నీలు, విదేశీ పర్యటనల అసలు లక్ష్యం.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us