BCCI : ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్న..ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులు సైతం అడుక్కునేలా..బీసీసీఐ ఖజానా రికార్డులు

BCCI : బీసీసీఐ తలరాతను మార్చేసిన ప్రధాన నిర్ణయం ఐపీఎల్ ప్రారంభం. 2008లో మొదలైన ఈ లీగ్, భారత క్రికెట్ బోర్డు ఖజానాను నోట్ల కట్టలతో నింపేసింది. కేవలం మీడియా హక్కులు (టీవీ, డిజిటల్) అమ్మడం ద్వారానే బోర్డు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది.

BCCI : ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్న..ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులు సైతం అడుక్కునేలా..బీసీసీఐ ఖజానా రికార్డులు
Bcci

Updated on: Dec 30, 2025 | 4:53 PM

BCCI : ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ అంటే ఒక తిరుగులేని శక్తి. గత 25 ఏళ్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎదిగిన తీరు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మక మానవు. కేవలం ఆటను నిర్వహించే ఒక సంస్థగా మొదలై, నేడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రీడా బోర్డుగా అవతరించింది. నేడు బీసీసీఐ నెట్ వర్త్ రూ.18,000 కోట్లకు పైమాటే. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సంపాదనలో కనీసం బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేవు. ఈ భారీ ఆర్థిక బలమే ఐసీసీ నిర్ణయాల్లోనూ భారత్‌కు తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టింది.

ఐపీఎల్ తెచ్చిన విప్లవం

బీసీసీఐ తలరాతను మార్చేసిన ప్రధాన నిర్ణయం ఐపీఎల్ ప్రారంభం. 2008లో మొదలైన ఈ లీగ్, భారత క్రికెట్ బోర్డు ఖజానాను నోట్ల కట్టలతో నింపేసింది. కేవలం మీడియా హక్కులు (టీవీ, డిజిటల్) అమ్మడం ద్వారానే బోర్డు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది. దీనికి తోడు జాతీయ జట్టు జెర్సీ స్పాన్సర్‌షిప్, టైటిల్ స్పాన్సర్‌షిప్, స్టేడియం టికెట్ల అమ్మకాలు, ఐసీసీ నుంచి వచ్చే వాటా బీసీసీఐని ధనవంతుల బోర్డుగా మార్చాయి.

అంకెల్లో బీసీసీఐ ఆదాయం

గత కొన్నేళ్లలో బీసీసీఐ ఆదాయం రాకెట్ వేగంతో పెరిగింది. 2017-18లో బోర్డు సంపాదన కేవలం రూ.2,916 కోట్లు ఉండగా.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అది ఏకంగా రూ.10,054 కోట్లకు చేరింది. అంటే దాదాపు 3.34 రెట్ల వృద్ధి అన్నమాట. 2020లో కరోనా వల్ల ఆదాయం కాస్త తగ్గినప్పటికీ, ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్‌లు, ఐపీఎల్ కొత్త టీమ్స్ రాకతో ఆదాయం మళ్ళీ పుంజుకుంది. కేవలం 2024-25లోనే బీసీసీఐ రూ.3,358 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం విశేషం. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బోర్డు రూ.8,963 కోట్లు సంపాదించింది.

మున్ముందు మరిన్ని కోట్లు

క్రికెట్ ఫార్మాట్లు మారుతున్నాయి, ఆదరణ పెరుగుతోంది. టీ20 లీగ్స్, డిజిటల్ వ్యూయర్‌షిప్ పెరుగుతున్న కొద్దీ బీసీసీఐ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఐదేళ్లలో మీడియా హక్కుల వేలం ద్వారా వచ్చే ఆదాయం గత రికార్డులను తిరగరాయడం ఖాయం. బీసీసీఐ దగ్గరున్న ఈ ఆర్థిక బలమే భారత దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశవాళీ ఆటగాళ్లకు భారీ జీతాలు ఇవ్వడానికి తోడ్పడుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..