
Bcci vs pcb Mohsin Naqvi: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత నెలకొన్న ట్రోఫీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు ఇంకా ట్రోఫీ దక్కకపోవడంతో ఈ అంశం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు అయిన మొహ్సిన్ నఖ్వీ, వచ్చే నెల (నవంబర్)లో దుబాయ్‌లో ఒక అధికారిక కార్యక్రమంలో భారత్‌కు ట్రోఫీని అందజేస్తానని ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, నఖ్వీ పెట్టిన షరతులు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైఖరి కారణంగా ఈ ప్రతిష్టంభన తొలగే అవకాశం కనిపించడం లేదు.
సెప్టెంబర్ 28, 2025న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. కానీ, పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ వేడుకలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ అంతర్గత మంత్రిగా కూడా ఉన్న మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. నఖ్వీకి ‘హ్యాండ్‌షేక్’ ఇవ్వడానికి కూడా భారత ఆటగాళ్లు ఇష్టపడలేదు. భారత్‌కు వ్యతిరేకంగా నఖ్వీ చేసిన వ్యాఖ్యలు, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న వైఖరి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
దీంతో నఖ్వీ ట్రోఫీని, పతకాలను స్టేడియం నుంచి తన హోటల్ గదికి, ఆ తర్వాత దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని బీసీసీఐ తీవ్రంగా ఖండించింది.
ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో, మొహ్సిన్ నఖ్వీ నుంచి తాజా ప్రతిపాదన వచ్చింది. నఖ్వీ నవంబర్ 10న దుబాయ్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, భారత జట్టుకు ట్రోఫీని అధికారికంగా అందజేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ACC, BCCI మధ్య లేఖల మార్పిడి జరిగింది. అయితే, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వచ్చి ట్రోఫీని తన చేతుల మీదుగా అందుకోవాలని నఖ్వీ పట్టుబడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ షరతును బీసీసీఐ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ట్రోఫీని వెంటనే భారతదేశానికి అప్పగించాలని లేదా దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచాలని, అక్కడి నుంచి భారత ప్రతినిధి సేకరించుకుంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం నవంబర్‌లో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ గట్టిగా హెచ్చరించింది. ఈ విషయంలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా బీసీసీఐకి మద్దతు తెలుపుతూ నఖ్వీకి ట్రోఫీని అప్పగించాలని కోరాయి. ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంది. నఖ్వీ ఆదేశాల మేరకు తన అనుమతి లేకుండా దానిని అక్కడి నుంచి తరలించవద్దని సిబ్బందికి సూచించినట్లు సమాచారం.
నవంబర్ మొదటి వారంలో (నవంబర్ 4 నుంచి 7 వరకు) దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ ఈ ట్రోఫీ వివాదాన్ని ప్రధాన అంశంగా లేవనెత్తాలని నిర్ణయించుకుంది. నఖ్వీ తీరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని బీసీసీఐ ఆరోపిస్తోంది. ఐసీసీ వేదికగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. మొహ్సిన్ నఖ్వీ ఆఫర్ చేసినా, ట్రోఫీని అధికారికంగా స్వీకరించే విషయంలో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగేలా లేదు. ప్రపంచ క్రీడా మండలిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి బీసీసీఐ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..