ఇదేం వీరబాదుడు మావ.. ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత.. 37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారుగా

|

Dec 23, 2024 | 5:02 PM

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరో ఊహకందని ఊచకోత జరిగింది. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అనుకుంటే పొరపాటు.. బరోడా జట్టు బ్యాటర్లు ఉతికి ఆరేశారు. నిర్ణీత 50 ఓవర్లలో భారీ స్కోర్ సాధించారు. ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటంటే

ఇదేం వీరబాదుడు మావ.. ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత.. 37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారుగా
Baroda Team
Follow us on

విజయ్ హజారే ట్రోఫీలో బరోడా జట్టు అద్భుతాలు సృష్టించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో కృనాల్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 403 పరుగులు చేసింది. బరోడా తరపున 25 ఏళ్ల యువ ఓపెనర్ నినాద్ రథ్వా అద్భుత సెంచరీ చేయగా, పార్త్ కోహ్లి, కృనాల్ పాండ్యా హాఫ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. బరోడా జట్టు మొత్తంగా 14 సిక్సర్లు, 37 ఫోర్లతో కేరళ బౌలర్లను ఉతికిఆరేసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఓ జట్టు స్కోరు 400 దాటడం గమనార్హం.

ఆరంభం ఫ్లాప్, ముగింపు హిట్..

తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నంలో శాశ్వత్ రావత్ 10 పరుగులకే అవుటయ్యాడు. దీని తర్వాత పార్థ్ కోహ్లీతో కలిసి ఓపెనర్ నినాద్ రథ్వా 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేరళను చిత్తు చేశాడు. నినాద్ రథ్వా 99 బంతుల్లో 136 పరుగులు చేశాడు. అతడు బ్యాట్‌తో 3 సిక్సర్లు, 19 ఫోర్లు బాదాడు. మరోవైపు పార్థ్ కోహ్లీ 87 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌తో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు వచ్చాయి.

పాండ్యా-సోలంకి హిట్టింగ్..

కృనాల్ పాండ్యా, విష్ణు సోలంకి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పాండ్యా 54 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ బరోడా కెప్టెన్ తన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు. సోలంకి 3 సిక్సర్లు, 3 ఫోర్లు రాబట్టాడు. చివర్లో, భాను పునియా కూడా 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులతో చెలరేగాడు. దీంతో బరోడా జట్టు నిర్ణీత ఓవర్లకు భారీ స్కోర్ సాధించగలిగింది.

గత మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా ఫ్లాప్..

కృనాల్ పాండ్యా గత మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యాడు, అతడు 33 బంతుల్లో కేవలం 13 పరుగులు చేయగలిగాడు. కానీ ఈసారి అద్భుతంగా పునరాగమనం చేశాడు. గత మ్యాచ్‌లో బరోడా 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ బరోడా 302 పరుగులు చేసింది.