
Jahanara Alam : బంగ్లాదేశ్ క్రికెట్ రంగంలో సంచలనం సృష్టించిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ జహనారా ఆలం తనపై మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బహిరంగంగా ఆరోపించింది. 2022 మహిళల వన్డే ప్రపంచ కప్ సమయంలో జాతీయ జట్టు నిర్వహణ నుంచి తాను అసభ్యకరమైన ప్రతిపాదనలను ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది. ఈ వేధింపులకు అంగీకరించనందుకే తన కెరీర్‌ను అడ్డుకున్నారని జహనారా ఆరోపించింది. ప్రస్తుతం మానసిక ఆరోగ్యం కోసం విరామం తీసుకుంటున్న ఆమె, ఈ వివరాలను రియాసత్ అజీమ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకుంది.
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుకు చెందిన సీనియర్ క్రికెటర్ జహనారా ఆలం యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంచలన ఆరోపణలు చేసింది. తాను ఒక్కసారి కాదు పలుమార్లు అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నానని, బీసీబీ అధికారులు ఈ విషయంలో తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆమె వెల్లడించింది. “జీవనాధారం క్రికెట్ అయినప్పుడు, కొందరికే తెలిసిన వ్యక్తి అయినప్పుడు, మీరు ఇష్టపడకపోయినా అనేక విషయాలను వ్యతిరేకించలేరు” అని ఆమె పేర్కొంది. ఇది క్రికెట్ ప్రపంచంలో మహిళా అథ్లెట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతోంది.
ఈ విషయమై తాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులోని సీనియర్ అధికారులైన మహిళా కమిటీ అధిపతి నాదెల్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి సంప్రదించినప్పటికీ, వారు తన ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించలేదని జహనారా తెలిపింది. క్రికెట్‌లో అత్యున్నత స్థాయిలోని వ్యక్తులే తమ సమస్యలను పట్టించుకోకపోవడం, ఆటగాళ్లకు రక్షణ కల్పించడంలో బోర్డు వైఫల్యాన్ని ఇది సూచిస్తుంది.
జహనారా తన కెరీర్ దెబ్బతినడానికి మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాంను వ్యతిరేకించడమే కారణమని ఆరోపించింది. 2021లో కోఆర్డినేటర్ సర్ఫరాజ్ బాబు ద్వారా తౌహిద్ భాయ్ తనను సంప్రదించారని జహనారా గుర్తు చేసుకుంది. తాను తెలివిగా ఆ ప్రతిపాదనను తప్పించుకున్న తరువాత, మంజురుల్ భాయ్ మరుసటి రోజు నుంచే తనను అవమానించడం, అగౌరవపరచడం మొదలుపెట్టినట్లు ఆమె వివరించింది. ఇది జట్టు సెలక్షన్లలో, ట్రైనింగ్ ప్రక్రియల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ట్రైనింగ్ సెషన్ల సమయంలో మంజురుల్ మహిళా ఆటగాళ్లకు చాలా దగ్గరగా వచ్చి వారి భుజాలపై చేయి వేయడం, వారిని తన ఛాతీకి దగ్గరగా లాగి చెవిలో మాట్లాడటం వంటి అలవాటు ఉండేదని జహనారా ఆరోపించింది. ఇది మహిళా క్రీడాకారుల ప్రైవసీకి భంగం కలిగించడమే కాకుండా, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక వేధింపులకు గురిచేసే ఒక నిర్దిష్ట సంఘటనను జహనారా వెల్లడించింది. “ఒకసారి అతను నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని నా భుజంపై చేయి వేసి నా చెవి దగ్గర వంగి నీకు పీరియడ్స్ వచ్చి ఎన్ని రోజులైంది? అని అడిగాడు అని జహనారా చెప్పింది. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఫిజియోలు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆటగాళ్ల పీరియడ్స్ సైకిల్స్‌ను ట్రాక్ చేస్తారు. ఆ విషయం అతనికి ముందే తెలుసని, అయినప్పటికీ అతను ఇలా అడగడం అనుచితమని ఆమె పేర్కొంది.
జహనారా ఆరోపణలను మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం, కోఆర్డినేటర్ సర్ఫరాజ్ బాబు ఖండించారు. మంజురుల్ ఈ ఆరోపణలను నిరాధారమైనవి అని కొట్టిపారేశాడు. తాను మంచివాడినో కాదో ఇతర క్రికెటర్లను అడగవచ్చని ఆయన క్రిక్‌బజ్‌తో అన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..