Match Fixing Scandal: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం..

Bangladesh Cricket: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరుస వివాదాలతో సతమతమవుతోంది. రాజకీయ అస్థిరత, అంతర్గత పోరుతో ఇప్పటికే కుదేలైన ఆ దేశ క్రికెట్‌ను తాజాగా మ్యాచ్ ఫిక్సింగ్ భూతం నీడలా వెంటాడుతోంది. తాజాగా జరిగిన సి.జె.కె.ఎస్ టాలెంట్ కప్ పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఆటగాళ్లతో పాటు కోచ్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం క్రీడాలోకంలో పెద్ద చర్చకు దారితీసింది.

Match Fixing Scandal: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం..
Match Fixing Scandal

Updated on: Apr 07, 2026 | 3:00 PM

Bangladesh Cricket: ఛటోగ్రామ్ జిల్లా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన టాలెంట్ కప్ టీ20 టోర్నమెంట్‌లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ఏప్రిల్ 3న బాకలియా ఏకాదష్, క్రెసెంట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాకలియా జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు కావాలనే వికెట్లను పారేసుకున్నారు. వీరి ఆటతీరు అత్యంత అనుమానాస్పదంగా ఉండటంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సకిబ్ హుస్సేన్, ఒబైదుల్ ఆలం, ఒమర్ ఫరూక్, టిన్ ధర్, మాహిర్ అన్వర్, మహమ్మద్ ఇక్బాల్, నాజ్ముల్ ఇస్లాంలు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. వీరందరిపై క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ నిషేధం విధించారు.

కోచ్‌పై ఐదేళ్ల నిషేధం..

కేవలం ఆటగాళ్లే కాకుండా, ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన జట్టు కోచ్ అమీనుల్ హక్‌పై కూడా అధికారులు కొరడా ఝుళిపించారు. క్రమశిక్షణారాహి, అవినీతికి పాల్పడినందుకు ఆయనను ఐదేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి బహిష్కరించారు. ఈ నిషేధాన్ని దేశంలోని అన్ని దేశీవాళీ లీగ్‌లలోనూ అమలు చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సి.జె.కె.ఎస్ అధికారికంగా విజ్ఞప్తి చేసింది.

కొనసాగుతున్న వివాదాల పరంపర..

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఇటువంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో జరిగిన బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్ (బీపీఎల్) లో కూడా బోర్డు డైరెక్టర్ ముఖ్లేసూర్ రెహమాన్ షమీమ్ ఫిక్సింగ్ చర్చల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక స్థానిక విలేకరి నిర్వహించిన పరిశోధనలో షమీమ్ ఒక హోటల్‌లో బుకీలతో సమావేశమైనట్లు ఆధారాలు లభించాయి. అలాగే 2025 బీపీఎల్ సీజన్‌లో ఏకంగా పదిమంది క్రికెటర్లు అవినీతి నిరోధక విభాగం నిఘాలో ఉండటం గమనార్హం.

కొత్త ఆశలతో ముందుకు..

గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ క్రికెట్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత క్రికెట్ బోర్డుతో విభేదాలు, ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ నుంచి దూరం కావడం వంటి పరిణామాలు ఆ దేశ క్రికెట్‌ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, ఇటీవల పాకిస్థాన్‌పై సాధించిన వన్డే సిరీస్ విజయం వారికి కొంత ఊరటనిచ్చింది. రానున్న 12 నెలల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి జట్లతో జరిగే సిరీస్‌ల ద్వారా మళ్లీ పుంజుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. అలాగే మహిళా ప్రిమియర్ లీగ్ ద్వారా భారత క్రీడాకారిణులను ఆహ్వానించి, బీసీసీఐతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us