
ICC Men’s ODI World Cup Australia vs South Africa Playing XI: ప్రపంచ కప్ 2023లో 10వ మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కాగా తొలి గేమ్ లో ఓడిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి, టాప్ లో చేరాలని చూస్తోంది. అలాగే తొలి విజయంతో ఫుల్ ఫాంలో ఉన్న సౌతాఫ్రికా జట్టు మరో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు చూస్తోంది. దీంతో ఈపోరు చాలా ఆసక్తికంగా ఉండనుంది.
ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చేసింది. అలెక్స్ కారీ స్థానంలో జోష్ ఇంగ్లిస్, కెమెరూన్ గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్‌కు అవకాశం దక్కింది. దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు ఉంది. గెరాల్డ్ కూటీస్ స్థానంలో తబ్రేజ్ షమ్సీ తిరిగి వచ్చాడు.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, లుంగీ ఎన్గిడి.
ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌లో భారత్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాగా, దక్షిణాఫ్రికా 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా మూడుసార్లు, దక్షిణాఫ్రికా రెండుసార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. ఓవరాల్ హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 108 వన్డేలు జరిగాయి. ఆస్ట్రేలియా 50, దక్షిణాఫ్రికా 55 మ్యాచ్‌లు గెలిచాయి. మూడు మ్యాచ్‌లు టై కాగా, ఒకటి ఫలితం తేలలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..