పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచిన టీమిండియా కేవలం 150 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రోజు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరో 4 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ 2, యువ పేసర్ హర్షిత్ రాణా 1 వికెట్ తీశారు. భారత్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్ కు టీమ్‌ఇండియా పేసర్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల బుల్లెట్ల లాంటి బంతులకు కనీసం ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఆసీస్ తరఫున అత్యధికంగా 52 బంతులు ఎదుర్కొన్న లాబుస్‌చాగ్నే 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మిగతా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎవరూ 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. జట్టు తరఫున అలెక్స్ కారీ అత్యధికంగా 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ 150 పరుగులకు ముగిసింది. జట్టులో నితీష్ రెడ్డి అత్యధికంగా 41 పరుగులు చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 37 పరుగులు, కేఎల్ రాహుల్ 26 పరుగులు చేశారు. ఇక యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టగా, విరాట్ కోహ్లీ ఐదు పరుగుల వద్ద ఔటయ్యాడు. ధృవ్ జురెల్ 11 పరుగులు, వాషింగ్టన్ సుందర్ కూడా నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కానీ పంత్, నితీష్ ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. కమిన్స్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. పంత్ ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ 150 పరుగులకే కుప్పకూలింది. చివరగా, హర్షిత్ రాణా ఏడు పరుగుల వద్ద అవుట్ కాగా, బుమ్రా ఎనిమిది పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.
భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..