Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం..పెళ్లిలోనూ ప్రశ్నల వర్షం.. సిగ్గుతో తలవంచుకున్న మొహసిన్ నఖ్వీ

పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ వివాహం కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ కూడా హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు, ఎందుకంటే ఆయన భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లిపోయారు. అబ్రార్ పెళ్లిలో కూడా ఆయన ఈ ప్రశ్న నుండి తప్పించుకోలేకపోయారు.

Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం..పెళ్లిలోనూ ప్రశ్నల వర్షం.. సిగ్గుతో తలవంచుకున్న మొహసిన్ నఖ్వీ
Mohsin Naqvi (1)

Updated on: Oct 07, 2025 | 2:10 PM

Asia Cup Trophy Controversy: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ గెలిచినప్పటికీ, ఆయన ట్రోఫీని విజేతలకు ఇవ్వకుండా తనతో పాటు తీసుకెళ్లిపోయారు. ఈ వివాదం కొనసాగుతుండగానే, పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ పెళ్లికి హాజరైన నఖ్వీకి, అక్కడ జర్నలిస్టుల నుంచి ఈ అంశంపై కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయన నవ్వుతూ తప్పించుకోవడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించి తమ 9వ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే, ఆయన పాకిస్తాన్ హోం మంత్రి కూడా కావడంతో గతంలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించారు అనే వార్తలు వచ్చాయి. దీని తర్వాత నఖ్వీ టీమిండియాకు ట్రోఫీని అందించకుండానే, దాన్ని తనతో పాటు తీసుకెళ్లిపోయారు.

పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పెళ్లి వేడుక కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ జట్టులోని పలువురు ఆటగాళ్లతో పాటు మొహ్సిన్ నఖ్వీ కూడా హాజరయ్యారు. పెళ్లి అనంతరం బయటకు వస్తున్న నఖ్వీని ఒక జర్నలిస్ట్ ఆపి.. “సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించలేదు అని చెప్తున్నారు కదా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నఖ్వీ మొహంపై సిగ్గులేకుండా నవ్వుతూ కనిపించారు. బహుశా ఆయనకు సమాధానం ఇవ్వడానికి ఏమీ లేకపోవడంతో, ఆయన నవ్వుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తరువాత, మరో జర్నలిస్ట్ “ఆసియా కప్ భవిష్యత్తు ఏమిటి?” అని అడగ్గా, నఖ్వీ కేవలం నవ్వుతూనే ముందుకు వెళ్లిపోయారు.

ఈ వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై న్యాయ సలహా తీసుకుంటోంది. ఏసీసీ సమావేశంలో కూడా బీసీసీఐ ప్రతినిధులు మొహ్సిన్ నఖ్వీని ఈ ట్రోఫీ వివాదంపై ప్రశ్నించారు. దీనికి నఖ్వీ సమాధానం ఇస్తూ, సూర్యకుమార్ యాదవ్ తన ఆఫీసుకు వచ్చి ట్రోఫీని తీసుకోవచ్చు అని అన్నారు. దీనికి బీసీసీఐ స్పష్టంగా నిరాకరించింది. స్టేడియంలోనే ట్రోఫీని తీసుకోనప్పుడు, మళ్లీ ఆఫీసుకు వెళ్లి తీసుకునే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ చర్యల ద్వారా బీసీసీఐ, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన మొహ్సిన్ నఖ్వీపై కఠిన వైఖరిని ప్రదర్శించింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..