Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి భారత స్పిన్నర్ అదిరిపోయే కౌంటర్

ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, విజేతగా నిలిచిన టీమిండియాకు ఇప్పటికీ ట్రోఫీని అందజేయలేదు. ఈ అంశంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

Asia Cup 2025  :  ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి భారత స్పిన్నర్ అదిరిపోయే  కౌంటర్
Mohsin Naqvi

Updated on: Oct 17, 2025 | 7:30 AM

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, విజేతగా నిలిచిన టీమిండియాకు ఇప్పటికీ ట్రోఫీని అందజేయలేదు. ఈ అంశంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ విషయంపై మౌనం వీడి, మొహ్సిన్ నఖ్వీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు..”మీరు ఆసియా కప్ ట్రోఫీని ఉంచుకోవచ్చు, కానీ మేము మాత్రం ఇప్పటికీ ఛాంపియన్‌లమే!” అంటూ వరుణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

 

ఆసియా కప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, గౌరవ్ కపూర్ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో ఈ వివాదం గురించి మాట్లాడారు. “వారు కేవలం ట్రోఫీని మాత్రమే తమ వద్ద ఉంచుకోగలరు, కానీ భారత్ నుంచి ఛాంపియన్ అనే ట్యాగ్‌ను ఎవరూ లాక్కోలేరు” అని ఆయన స్పష్టం చేశారు. “మేము అన్ని మ్యాచ్‌లను గెలుస్తామని నాకు ముందే తెలుసు. మేము ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్. వారు ఆ కప్‌ను ఉంచుకోవచ్చు, కానీ మేము ఛాంపియన్‌లం” అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఆసియా కప్ టైటిల్ సాధించడంలో వరుణ్ ఆరు మ్యాచ్‌లలో 20.42 సగటుతో ఏడు వికెట్లు తీసి కీలకపాత్ర పోషించారు.

 

భారత జట్టు ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత ఈ వివాదం మొదలైంది. మ్యాచ్ అనంతరం, విజేతగా నిలిచిన టీమిండియా ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నఖ్వీ, ట్రోఫీని తనతో పాటు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నఖ్వీ “భారత్ కావాలంటే ఏసీసీ ఆఫీసుకు వచ్చి అక్కడ నుంచి ట్రోఫీని తీసుకోవచ్చు” అని కామెంట్స్ చేయడం ద్వారా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఏసీసీ ఛైర్మన్ అయిన నఖ్వీ వైఖరిపై బీసీసీఐ సీరియస్‌గా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.

 

ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ వరుణ్ చక్రవర్తి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను గెలుపు తర్వాత ట్రోఫీతో పడుకున్న చిత్రాన్ని పోస్ట్ చేయాలని అనుకున్నట్లు వరుణ్ చెప్పాడు. “నేను అంతా ప్లాన్ చేసుకున్నాను. మేము గెలుస్తామని నాకు తెలుసు. అందుకే ట్రోఫీతో పడుకున్న ఫోటో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మ్యాచ్ తర్వాత నా పక్కన ఏమీ లేదు. కేవలం ఒక కాఫీ కప్పు మాత్రమే ఉంది. దాంతోనే నేను ఆ కప్పును తీసుకుని (ట్రోఫీలాగా) పడుకున్నాను” అని నవ్వుతూ చెప్పారు. ఈ సంఘటన ట్రోఫీని అందించడంలో జరిగిన ఆలస్యంపై భారత ఆటగాళ్లలో ఉన్న అసంతృప్తిని పరోక్షంగా తెలియజేస్తుంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..