
ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఆరోపించడంపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. క్రికెట్‌లో రాజకీయ పార్టీల జోక్యం ఉండదని, గతంలో విహారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. విహారి ఆరోపణలు విచారకమని అభిప్రాయపడింది.
ఆంధ్ర క్రికెట్ సంఘం తరపున ఆడుతోన్న క్రికెటర్ హనుమ విహారి ఈ ఏడాది రంజీ సీజన్ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించి కలకలం రేపాడు. రాజకీయ నేతల జోక్యంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నానని సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టాడు. జట్టుకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని ఆరోపించాడు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసిందని, ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించడంతో భవిష్యత్‌లో ఆంధ్ర జట్టుకు ఇక ఆడేదే లేదని స్పష్టం చేశాడు హనుమ విహారి.
హనుమ విహారి ఆరోపణలపై ఏపీ రాజకీయ పార్టీలు స్పందించాయి. క్రీడల్లో రాజకీయ జోక్యం తగదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అభిప్రాయపడ్డారు. విహారి చేసిన ఆరోపణలపై వైసీపీ నేత, తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ కే. నరసింహాచారి కుమారుడు పృధ్వీరాజ్ స్పందించాడు. విహారి చెప్పిందంతా అబద్ధమని కావాల్సిన విధంగా సింపథీ గేమ్స్ ఆడుకోమంటూ పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరోవైపు విహారిని కెప్టెన్‌గా తొలగించాలంటూ ఏసీఏపై తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని పృథ్వీరాజ్ తండ్రి, వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి స్పష్టం చేశారు.
అయితే విహారి ఆరోపణలపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. విహారి ఆరోపణలు విచారకరమంటూనే ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం వస్తే సరిదిద్దాల్సిన బాధ్యత అసోసియేషన్‌దేనని తెలిపింది. గతంలో విహారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. క్రికెట్‌లో రాజకీయ పార్టీల జోక్యం ఉండదని తేల్చి చెప్పింది. విహారి ఆరోపణలను వేదికగా చేసుకుని కొన్ని రాజకీయపార్టీలు, ఆ పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు చేయడం అత్యంత విచారకరమని, క్రికెట్‌పై రాజకీయాలు తగవని వారికి ఏసీఏ సూచించింది. విహారిపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయని, క్షమాపణ కోరుతూ చేసిన మెయిల్స్ కూడా ఉన్నాయని, తనపై ఎలాంటి చర్య తీసుకున్నా పర్లేదంటూ విహారి మెయిల్స్ పంపారని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.
ఈ ఏడాది జనవరిలో బెంగాల్‌తో ఆడిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జట్టుకు అప్పుడు కెప్టెన్ గా ఉన్న హనుమ విహారి…. పృథ్విరాజ్‌ను కాదని గాయపడిన ఇంకొక వికెట్ కీపర్‌ను ఆడించారని ఏసీఏ తెలిపింది. బెంగాల్‌తో రంజీ మ్యాచ్ సందర్భంగా విహారి వ్యక్తిగతంగా ఆ ఆటగాడిని అందరి ముందు దూషించారంటూ ఫిర్యాదు కూడా వచ్చిందని తెలిపింది. బాధిత ఆటగాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశాడని తెలిపింది. విహారి గతంలో ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా అసభ్య పదజాలం వాడటం, తోటి ఆటగాళ్ల పట్ల అనుచింతంగా ప్రవర్తించడంపై ఆంధ్రా జట్టు మేనేజర్ అసోసియేషన్‌కు ఫిర్యాదుచేశారని, విహారి వ్యవహారశైలి కారణంగా జట్టులో వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులో ఉందని తెలిపింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…