
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ఒకటి. ఒక్క ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు.. జట్టులో భాగమైన సూపర్ స్టార్ ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. అయితేనేం ఇన్నీ ఉన్నా.. ఇప్పటికీ ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ దక్కలేదు. 2017-19 మధ్య ఈ ఫ్రాంచైజీ అందుకున్న ఓటములు.. టోర్నమెంట్ మెయిన్ లీగ్ నుంచి తప్పుకునేలా చేశాయి. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. అటు క్రిటిక్స్.. ఇటు ట్రోలర్స్‌కు గట్టి పంచ్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఫ్లయింగ్ స్టార్ట్ లభించింది. చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. 172 పరుగుల టార్గెట్ చేధించడంలో విరాట్ కోహ్లీ(82) కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత విజయం అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు(8) ప్లే-ఆఫ్స్ చేరిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పేర్కొన్నాడు.
‘నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ముంబై ఇండియన్స్ 5సార్లు టైటిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు టైటిల్స్ తర్వాత ప్లేఆఫ్‌లకు అత్యధిక సార్లు(8) అర్హత సాధించిన మూడవ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టోర్నమెంట్‌లో మేము ప్రణాళికలు సరిగ్గా అమలు చేసి.. ట్రోఫీని సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. అలాగే 4 సంవత్సరాల తర్వాత మా హోం గ్రౌండ్‌లో ఆటను మళ్లీ విజయంతో మొదలుపెట్టడం సంతోషంగా ఉందని స్పష్టం చేశాడు.