Video: W,W, హ్యాట్రిక్ వికెట్ కోసం ఏకంగా 42 బంతులు.. కట్‌చేస్తే.. 920 రోజుల తర్వాత అద్భుతం..

Mujeeb Ur Rahman Hat-trick: టీ20 ప్రపంచకప్ 2026 కోసం అన్ని జట్లు తుది ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో వరుసగా సిరీస్ లు ఆడుతూ ప్లేయర్ల ఫాంతోపాటు టీం ఆర్డర్ పైనా ఫోకస్ పెంచుతున్నాయి. అయితే, ఆఫ్గనిస్తాన్ జట్టు తరపున దాదాపు 920 రోజుల తర్వాత ఓ అద్బుతం నమోదైంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Video: W,W, హ్యాట్రిక్ వికెట్ కోసం ఏకంగా 42 బంతులు.. కట్‌చేస్తే.. 920 రోజుల తర్వాత అద్భుతం..
Mujeeb Ur Rahman Hat Trick

Updated on: Jan 22, 2026 | 9:10 AM

Mujeeb Ur Rahman Hat-trick: టీ20 ప్రపంచకప్ 2026కు సమయం దగ్గరపడుతోంది. ఈ మేరకు అన్ని జట్లు తమ తుది సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఆఫ్ఘానిస్తాన్ జట్టు వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అఫ్ఘానిస్థాన్ స్పిన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాడు. 3 వరుస బంతుల్లో ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ చేర్చి, తన కెరీర్‌లో తొలి టీ20ఐ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈ ఆఫ్ఘాన్ బౌలర్ 920 రోజుల తర్వాత టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఓ అద్భుతాన్ని క్రికెట్ ఫ్యాన్స్ కు రుచిచూపించాడు.

హ్యాట్రిక్ కోసం 42 బంతుల వరకు ఎదురుచూపులు..?

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ముజీబ్ ఉర్ రెహమాన్ తన తొలి హ్యాట్రిక్ కోసం ఏకంగా 42 బంతులో ఎదురుచూడాల్సి వచ్చింది. అంటే, ముజీబ్-ఉర్-రెహమాన్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించలేదండోయ్.. ఈ ఘనతను సాధించేందుకు 2 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అది ఎలాగో ఓసారి చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి రెండు బంతుల్లో 2 వికెట్లు పడగొట్టాడు. ఎవిన్ లూయిస్, జాన్సన్ చార్లెస్‌లను వరుసగా ఔట్ చేశాడు. ఆ తర్వాత ముజీబ్ తన హ్యాట్రిక్ వికెట్ కోసం 16వ ఓవర్ వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అంటే, 9వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు ఈ యంగ్ బౌలర్ బౌలింగ్ చేయలేదన్నమాట.

920 రోజుల తర్వాత ఇలా..

189 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రుమంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ హ్యాట్రిక్ సాధించడం గమనార్హం. హ్యాట్రిక్ తోపాటు నలుగురు వెస్టిండీస్ ప్లేయర్లను పెవిలియన్ చేరాడు. తన 4 ఓవర్లలో 21 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. 920 రోజుల్లో ఒక ఆఫ్ఘన్ బౌలర్ టీ20ఐలలో హ్యాట్రిక్ తీయడం ఇదే మొదటిసారి. అంటే, చివరిసారిగా జులై 14, 2023న బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20ఐ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన కరీం జనత్ హ్యాట్రిక్ సాధించాడు.

టీ20ఐలలో ఆఫ్ఘన్ బౌలర్లు హ్యాట్రిక్ వివరాలు..

ముజీబ్ ఉర్ రెహ్మాన్ టీ20ఐలలో హ్యాట్రిక్ తీసిన మూడవ ఆఫ్ఘానిస్తాన్ బౌలర్ గా నిలిచాడు. అంతకుముందు రషీద్ ఖాన్, కరీం జనత్ ఈ ఘనత సాధించారు. 2019 లో ఐర్లాండ్ తో జరిగిన టీ20ఐలో సెన్సేషన్ స్పిన్నర్ రషీద్ హ్యాట్రిక్ సాధించాడు.

ఆఫ్ఘనిస్తాన్ విజయంలో హీరోగా..

ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే, మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 150 పరుగులు మాత్రమే చేసి 39 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..