
Hundred League : మెన్స్ హండ్రెడ్ లీగ్‌లో కావ్యా మారన్ జట్టు నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సంచలన విజయాన్ని అందుకుంది. నిన్న (ఆగస్టు 13) జరిగిన ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుపై చివరి బంతికి విజయం సాధించి, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. చివరి బంతికి విజయం కోసం 5 పరుగులు అవసరమైనప్పుడు, బ్యాట్స్‌మెన్ గ్రాహమ్ క్లార్క్ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. టిమల్ మిల్స్ వేసిన స్లో బాల్‌ను క్లార్క్ బలంగా బౌండరీ అవతలకి పంపడంతో సదరన్ బ్రేవ్ జట్టు హోమ్ గ్రౌండ్ ఒక్కసారిగా సైలెంటుగా మారిపోయింది. ఈ ఓటమితో వారి వరుస విజయాలకు బ్రేక్ పడింది.
మొదట బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ జట్టుకు శుభారంభం లభించలేదు. అయితే, మధ్యలో బ్యాటింగ్‌కు వచ్చిన లారీ ఎవాన్స్ (53 పరుగులు), జేమ్స్ కోల్స్ (49 నాటౌట్) అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు. ఎవాన్స్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టగా, కోల్స్ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిపోయాడు. వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా, సదరన్ బ్రేవ్ జట్టు 100 బంతులలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. బౌలింగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ తరపున జాకబ్ డఫ్ఫీ 3 వికెట్లు, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.
140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, జట్టును గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న గ్రాహమ్ క్లార్క్ (38 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో దూకుడుగా ఆడి జట్టును విజయానికి చేరువ చేశాడు. మరోవైపు, అతనికి మిచెల్ సాంట్నర్ (24) అండగా నిలిచాడు. అంతకుముందు ఓపెనర్లు జాక్ క్రాలే (29), హ్యారీ బ్రూక్ (24) కూడా పర్వాలేదనిపించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఓవర్టన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, టిమల్ మిల్స్ చెరో 2 వికెట్లు తీసి సూపర్‌చార్జర్స్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ, చివరి బంతికి సిక్సర్ కొట్టి గ్రాహమ్ క్లార్క్ మ్యాచ్‌ను ముగించడంతో కావ్య మారన్ జట్టు ఉత్సాహంతో మునిగిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.