Viral Video: మనదేశంలో క్రీడా ప్రతిభకు ఏ మాత్రం కొదవలేదు. మారుమూల గ్రామాల్లోనూ, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో సైతం మెరికల్లాంటి ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. వారికి కావాల్సిందల్లా ఒకటే.. కాసింత చేయూతనందించి ప్రోత్సహించడమే. ఈక్రమంలో ఒక కుర్రాడి బౌలింగ్ ప్రాక్టీస్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ట్యాలెంట్ పేరు భరత్ సింగ్. రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ 16 ఏళ్ల బాలుడు తన ముందున్న కష్టాలను ఆత్మవిశ్వాసంతో క్లీన్ బౌల్డ్ చేస్తున్నాడు. ఎలాంటి వసతులు, వనరులు లేకపోయినా కేవలం ఫిషింగ్ నెట్ సహాయంతో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భరత్ బౌలింగ్‌లోనే మాత్రమే కాదు, చదవడం, రాయడంలో కూడా దిట్ట. అయితే పేదరికం, కష్టాలు అతని ప్రతిభకు అడ్డంకిగా మారాయి. ఆ అడ్డంకులను ఎదుర్కొంటూనే ఆత్మవిశ్వాసంతో తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు.
క్రికెట్‌పై మక్కువ ఎక్కువే..
భరత్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. అంతకుముందు అతను తన సహచరులతో కలిసి టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. అయితే గత ఏడాదిన్నర నుంచి లెదర్ బాల్‌తో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. కాగా భరత్ బౌలింగ్ అద్భుతమని, అతడిలో క్రికెట్ పై ఉన్న మక్కువ చూసి ఏదో ఒక రోజు కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని గ్రామస్తులు అంటున్నారు.
రాహుల్‌గాంధీ ట్వీట్‌తో
కాగా ఇప్పటివరకు గ్రామానికి పరిమితమైన భరత్ ప్రతిభ ఇప్పుడిప్పుడే సరిహద్దులు దాటుతోంది. దీపక్ శర్మ అనే ఓ నెటిజన్ భరత్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో భరత్ తన సూపర్ బౌలింగ్‌తో ఒకే స్టంప్‌ను గురిపెట్టి పడగొడతాడు. ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏకంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఈ వీడియోకు ముగ్ధులయ్యారు. ‘ దేశంలోని నలుమూలల్లో అత్యద్భుత ప్రతిభ దాగి ఉంది. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావడం మనందరి బాధ్యత. భరత్ కలలు సాకారమయ్యేందుకు అన్ని విధాలా సహాయం చేయాలి’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌ను ట్యాగ్ చేశారు రాహుల్. ఈ ట్వీట్‌కు గెహ్లాత్ కూడా స్పందించారు. ‘తప్పకుండా.. భరత్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం’ అని సమాధానమిచ్చారు. కాగా త్వరలోనే ముఖ్యమంత్రిని కలవడానికి
భరత్ జైపూర్ వెళ్లనున్నట్లు సమాచారం.
हमारे देश के कोने-कोने में अद्भुत प्रतिभा छिपी हुई है, जिसे पहचानना और बढ़ावा देना हमारा कर्तव्य है।@ashokgehlot51 जी से मेरा निवेदन है, इस बच्चे का सपना साकार करने के लिए कृपया उसकी सहायता करें। https://t.co/vlEKd8UkmS
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..