Racial Abuse SCG: సిడ్నీ టెస్టు సందర్భంగా భారత్ క్రికెటర్లు జాతి వివక్షకు గురైనట్లు బుధవారం క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అక్కడి ప్రేక్షకులు జాతి వివక్ష దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై ఇండియన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా సీరియస్ కావడంతో.. సీఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనితో తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా సెక్యూరిటీ హెడ్ సీన్ కారోల్ కీలక ప్రకటన చేశాడు.
”భారత క్రికెట్ జట్టు సభ్యులు జాతి వివక్షకు గురైన సంగతి నిజమే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటివి ఫుటేజ్, టికెటింగ్ డేటా, ఆ రోజు మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల వివరాలను పరిశీలిస్తున్నాం. అసలు దోషులు ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు న్యూసౌత్ వేల్స్ పోలీసులు సైతం దీనిపై దర్యాప్తు పూర్తి చేశారు. వారి నుంచి ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అప్పటివరకూ దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేం” అని క్రికెట్ ఆస్ట్రేలియా తన నివేదికలో పేర్కొంది.