పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరు చెబితే చాలు క్రికెట్ అభిమానులు ఎగిరి గంతేస్తారు. అతడికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో పాకిస్తాన్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఫేస్ బౌలర్లు ఎంతమంది వచ్చినా షోయబ్ అక్తర్‌కు ఉండే గుర్తింపే వేరు. ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు అందరి చూపు సచిన్, అక్తర్‌ల పైనే ఉండేది. వారిద్దరూ మైదానంలో ఉంటే క్రికెట్ అభిమానులు పండగ చేసుకునేవారు.
ఇదిలా ఉంటే బౌలింగ్ స్పీడ్ పెంచుకోవడానికి అక్తర్‌కు కొంతమంది ఆటగాళ్లు డ్రగ్స్ వాడాలని సూచించారట. పాకిస్తాన్ యాంటీ నార్కోటిక్స్ సమావేశంలో పాల్గొన్న అక్తర్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించాడు. తాను బౌలర్‌గా ఉన్నప్పుడు ఎదుర్కొన్నపరిస్థితుల గురించి వివరించాడు. వేగం కోసం తాను ఎంతో ప్రాక్టీస్ చేసేవాడినని కానీ కొంతమంది డ్రగ్స్ వాడితేనే ఎక్కువ కాలం బౌలింగ్ చేయగలవని భయపెట్టేవారని తెలిపాడు. ఇలా చేయకపోతే నీ కేరీర్ మధ్యలోనే ముగుస్తుందని బెదిరించేవారని చెప్పుకొచ్చాడు. అయితే తాను వాటిని పట్టించుకోలేదని నిత్యం గ్రౌండ్‌లో పట్టుదలతో శ్రమించేవాడినని చెప్పాడు. అందుకే సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించగలిగానని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లకు సైతం ఇలాంటి పరిస్థితులు వస్తాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించాడు. అయితే డ్రగ్స్ తీసుకోమన్న ఆటగాళ్ల పేర్లు మాత్రం షోయబ్ బయటపెట్టలేదు..