
Dev Utthana Ekadashi Puja Vidhi Telugu: సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ఈ తిథి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశికి విశేష ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే శ్రీమహావిష్ణువు, నాలుగు నెలల అనంతరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కావడంతో దీనికి దేవ ఉత్థాన ఏకాదశి అనే పేరు వచ్చింది. దీనినే హరిబోధిని ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, దేవోత్తని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి స్వామివారిని పూజించడం, దీపారాధన చేయడం, దానధర్మాలు నిర్వహించడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. మరి 2026లో ఉత్థాన ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఈ రోజున ఎవరిని పూజించాలి? వ్రతాన్ని ఎలా ఆచరించాలి? తెలుసుకుందాం.
2026 నవంబర్ 20, శుక్రవారం రోజున కార్తిక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉత్థాన ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం విశేషంగా భావిస్తారు.
చాతుర్మాస కాలంలో యోగనిద్రలో ఉండే శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజును అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ముఖ్యంగా కార్తిక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం, ఉపవాసం ఆచరించడం, హరినామ స్మరణ చేయడం వల్ల పాపాలు తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం వంటి పురాణ గ్రంథాల్లో ప్రస్తావించబడింది.
ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. వీలైతే పవిత్ర నదుల్లో స్నానం చేయవచ్చు. అనంతరం ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని శ్రీలక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజా స్థలంలో ఏర్పాటు చేయాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి స్వామివారికి గంగాజలం, పంచామృతాలతో అభిషేకం చేయాలి.
ఉత్థాన ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు పసుపు రంగు పూలు, తులసి దళాలు సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు శ్రీహరి నామాలను స్మరించుకోవాలి. స్వామివారికి చక్రపొంగలి, పులిహోర వంటి ప్రసాదాలను నివేదించవచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం ముందు, తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి పూజించాలి.
ఈ పవిత్రమైన రోజున భక్తులు తమ ఆరోగ్యం, శక్తిని బట్టి నిరాహారంగా లేదా ఫలహారంతో ఉపవాసం ఆచరిస్తారు. రోజంతా విష్ణుమూర్తి నామస్మరణ చేస్తూ గడపాలి. రాత్రి భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఉపవాస సమయంలో సాత్విక ఆహార నియమాలను పాటించాలి.
ఉత్థాన ఏకాదశి రోజున అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని ధార్మిక విశ్వాసం. అలాగే తులసి మొక్కను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. మరుసటి రోజు వచ్చే ద్వాదశి తిథి నాడు ఉదయాన్నే స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజించాలి. అనంతరం నిర్ణీత పారణ సమయంలో ఆహారం తీసుకుని ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నియమనిష్ఠలతో ఉత్థాన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి కుటుంబంలో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, వ్రత నియమాలు పురాణాలు, ధార్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ఆచారాలు ప్రాంతాలను బట్టి మారవచ్చు. పాఠకులు తమ కుటుంబ సంప్రదాయాలు, స్థానిక పంచాంగం ప్రకారం ఆచరించగలరు.)