TTD Advisory: తిరుమల శ్రీవారి భక్తులూ జాగ్రత్త.. వారిని నమ్మి మోసపోకండి..!

Titumala Temple News: తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి కల్పిస్తామని చెప్పి కొందరు దళారులు భక్తులను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. దర్శనాలు, వసతి కోసం ఎలాంటి మధ్యవర్తులు లేదా దళారులను నమ్మవద్దని, అధికారిక మార్గాల ద్వారానే బుకింగ్‌లు చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

TTD Advisory: తిరుమల శ్రీవారి భక్తులూ జాగ్రత్త.. వారిని నమ్మి మోసపోకండి..!
Tirumala Ttd News

Updated on: Jun 26, 2026 | 1:42 PM

తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులను అప్రమత్తం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి దర్శనాలు, వసతుల కోసం మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి దర్శనాలు, తిరుమలలో వసతికి సంబంధించి భక్తులను మోసం చేస్తున్న దళారులపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ మోసపూరితమైన మాటలతో భక్తులను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి‌. ఈ నేపథ్యంలో ఎవరైనా దర్శనాలు, వసతి పేరుతో సంప్రదిస్తే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ : 155257 కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులను టీటీడీ కోరింది. శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఎంతో విశ్వాసము ఉంచి స్వామివారి దర్శనం కోసం పరితపించే భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న ఎంతటివారైనా సరే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటమని టీటీడీ అధికారులు హెచ్చరించారు.

మరోవైపు వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని..ఇవి పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టంచేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోందని తెలిపింది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని తెలిపింది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది.

భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది. దళారులు, మధ్య వర్తుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఇదే!

Loading...
Unable to load recommendations.
Follow Us