
Tiruchanur Surya Narayana Swamy Temple History Telugu: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తులు కేవలం కొండపై ఉన్న వేంకటేశ్వర స్వామినే దర్శించుకుని తిరిగి వెళ్లరు. తిరుపతి పరిసరాల్లోని అనేక ప్రాచీన ఆలయాలను కూడా సందర్శించడం ఆనవాయితీ. ముఖ్యంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం తిరుమల యాత్రలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. అదే తిరుచానూరులో పద్మసరోవరం తూర్పు తీరాన కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఎంతో విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ సూర్యనారాయణ స్వామి ఆలయం పద్మసరోవరం తూర్పు తీరాన పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇక్కడి స్థలపురాణం శ్రీహరి, లక్ష్మీదేవి కథతో ముడిపడి ఉంది. పురాణ కథనం ప్రకారం, భృగు మహర్షి ఘటన అనంతరం లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వస్తారు. ఆమెను వెతుకుతూ శ్రీమహావిష్ణువు భూలోకానికి వచ్చినప్పుడు, స్వర్ణముఖి నది తీరంలోని శుకమహర్షి ఆశ్రమ ప్రాంతంలో పద్మసరోవరాన్ని నిర్మించి సూర్యభగవానుడిని ఆరాధించాలని దైవవాణి సూచిస్తుంది.
దీంతో శ్రీనివాసుడు ఇక్కడ సరస్సును నిర్మించి, అందులో బంగారు పద్మాలను నాటినట్లు స్థలపురాణం చెబుతోంది. అనంతరం సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, సూర్య మంత్రాలను జపిస్తూ 12 సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేసినట్లు విశ్వాసం. ఆయన తపస్సుకు ప్రసన్నమైన సూర్యభగవానుడి అనుగ్రహంతో కార్తిక శుద్ధ పంచమి రోజున పద్మసరోవరంలోని బంగారు పద్మం నుంచి పద్మావతి దేవి ఆవిర్భవించారని పురాణ కథనం.
ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతారు. విజయనగర రాజుల కాలంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది. అనంతరం 1866లో మహంతుల పరిపాలనలో ధర్మదాసు జీ మహంత్ ఆలయాన్ని పునర్నిర్మించి స్వామివారిని పునఃప్రతిష్ఠించినట్లు ఆలయ చరిత్రలో పేర్కొంటారు. ప్రస్తుతం ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది.
గర్భాలయంలో సూర్యనారాయణ స్వామివారు నల్లని శిలతో రూపొందిన నిలువెత్తు మూలవిరాట్ రూపంలో దర్శనమిస్తారు. పద్మపీఠంపై నిలబడి, చేతుల్లో పద్మాలను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో ఉత్సవమూర్తి కూడా కొలువై ఉంటుంది.
ప్రతి ఆదివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రాల నడుమ అభిషేకం జరుపుతారు. ప్రతి నెల హస్తా నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం స్వామివారిని పల్లకిపై తిరుచానూరు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. మాఘమాసంలోని రథసప్తమి రోజున సూర్యప్రభ వాహన సేవ, ప్రత్యేక ఆరాధనలు మరింత వైభవంగా జరుగుతాయి.
“ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్” అనే భావనతో సూర్యభగవానుడిని ఆరోగ్య ప్రదాతగా భక్తులు ఆరాధిస్తారు. పద్మసరోవరంలో పవిత్ర స్నానం చేసి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. జాతకంలో సూర్య గ్రహ సంబంధిత దోషాలు ఉన్నవారు స్వామివారికి అభిషేకం, అర్చన చేయించడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయని కూడా నమ్ముతారు.
అందుకే తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, అక్కడి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. తిరుమల యాత్రకు వెళ్లే వారు ఈ ప్రాచీన సూర్యక్షేత్రాన్ని కూడా సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతారు.
(Disclaimer: ఈ కథనంలోని ఆలయ చరిత్ర, స్థలపురాణం, ఆధ్యాత్మిక విశేషాలు భక్తుల విశ్వాసాలు, పురాణాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)