
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో కాసేపట్లో లోకకల్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. భక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాములోరి కల్యాణఘట్టాన్ని ప్రత్యక్షంగా కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తకోటి పెద్దఎత్తున తరలివస్తుంది.
సీతారాములకు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు మిథిలా మైదానం సిద్ధమైంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.
నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ పండితులు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో ఎదుర్కొలు అత్యంత కీలకమైన ఘట్టం. పెళ్లికి ముందు సీతారాములను ఎదురెదురుగా ఉంచి, ఇరు పక్షాల వారు పసుపు, కుంకుమలు, తాంబూలాలు మార్చుకుంటూ, భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తారు. కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణాన్ని సీతమ్మ పుట్టినిల్లయిన మిథిలా నగరంగా.. పక్కనున్న వైకుంఠ క్షేత్రం రామయ్య వెలసిన ప్రాంతంగా భావిస్తారు. అలాగే.. అర్చకులు భగవంతుని వంశ క్రమాన్ని, గోత్ర నామాలను చదువుతూ పెళ్లికి ముందు వధూవరుల పక్షాన వాదోపవాదాలు చేసుకునే ఈ ఎదుర్కోలు ఘట్టం అత్యంత ఆసక్తికరంగా సాగింది.
ఇదిలావుంటే, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11గంటలకు రామాలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రూ.351కోట్లతో మొదటి విడత పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాలయ అభివృద్ధికి రూ.586కోట్లతో బృహత్తర ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దశ పనులను రూ.351కోట్లతో చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈపనులను 2027 నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు.
భద్రాచలంలో మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, ఆలయ ప్రాకారాల విస్తరణ, ఆలయ ప్రాంగణం సమీప పరిసరాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.గోదావరి ఘాట్లను విస్తరించనున్నారు. రెండో విడతలో.. రూ.108కోట్లతో రామాలయ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడతారు. వీటిని 2027లో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేస్తారు. మూడో విడతలో.. భద్రాచలం పట్టణాభివృద్ధికి కావాల్సిన పనులను ఇందులో చేపడతారు. వీటికి రూ.127కోట్లు కేటాయించారు. పనులను 2028లో ప్రారంభించి 2029 నాటికి పూర్తి చేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..