Yadagiri Gutta: యాదాద్రి పేరు మరోసారి మారిందా.. మళ్లీ యాదగిరి గుట్ట కానుందా..?

| Edited By: Ram Naramaneni

Apr 26, 2022 | 6:00 AM

యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మారుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని తిరుమల తిరుపతి స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చెందాలని.. యాదాద్రి అని నామకరణం చేశారు

Yadagiri Gutta: యాదాద్రి పేరు మరోసారి మారిందా.. మళ్లీ యాదగిరి గుట్ట కానుందా..?
Yadadri Temple
Follow us on

Yadagiri Gutta Temple: యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మారుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని తిరుమల తిరుపతి స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చెందాలని.. యాదాద్రి అని నామకరణం చేశారు. శ్రీలక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు ప్రకటించారు. ఈ యాదాద్రి పేరును త్రిదండి చినజీయర్ స్వామి సూచించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని యాదగిరి గుట్టగానే ప్రస్తావిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం పర్యటనకు సంబంధించి మొత్తం వివరాలు యాదగిరి గుట్ట పేరుతోనే ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యాదగిరి గుట్ట స్థానంలో యాదాద్రి అనే పేరును వాడటం లేదు.

యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చినట్లుగా గతంలో అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయో లేదో స్పష్టత లేదు. చాలా కాలంగా యాదాద్రి అనే ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారికంలో కూడా యాదగిరి గుట్ట అనే ప్రస్తావిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పర్యటన మొత్తం అధికారిక సమాచారంలో యాదగిరి గుట్ట అనే ఉంది. దాంతో యాదాద్రి పేరును ఇక తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని భావిస్తున్నారు. మరోవైపు, కొంత కాలంగా యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి.

యాదగిరి గుట్ట అనేది తెలంగాణ జన బాహుళ్యంలో విశ్లేష ప్రాచుర్యం పొందింది. నరసింహా స్వామి దగ్గరకు వెళ్లడం కన్నా గుట్టకు వెళ్లొద్దామా అనే వాడుకలో ప్రసిద్ధి. యాదాద్రి అని పేరు మార్చిన తర్వాత కూడా అది మారలేదు. ఇక నుంచి యాదాద్రి అనే పేరు ఎక్కువగా వినిపించకపోవచ్చని.. యాదగిరి గుట్టగానే ప్రాచుర్యంలోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయం కాస్తా మరోసారి యాదగిరి గుట్టగా మారబోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Read Also…  చిలకపచ్చ చీరలో అందాల కోయిలమ్మ…