Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహాక్రతువులో భాగంగా యాగశాలలో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు. 5 వేల మంది రుత్విజులు వేదమంత్రాలు చదువుతుండగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో హోమ క్రతువును నిర్వహించారు. సృష్టి దివ్య ప్రబంధాలు, భగవద్గీతలోని ప్రధాన అధ్యయనాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉజ్జీవన యజ్ఞం పూర్తిచేశారు. విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టిని నిర్వహించారు. ఉదయం సామూహిక ఉపనయనాలు చేశారు.
ప్రవచన మండపంలో శ్రీ అహోబిల రామనుజ జీయర్ స్వామి భక్తులతో శ్రీ లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామావళిపూజను నిర్వహించారు. శ్రీ రామచంద్ర జీయర్ స్వామి భక్తులతో పూజను చేయించారు. సుమారు రెండు వేల మంది భక్తులు పూజలో పాల్గొన్నారు. ఇక సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో 108 దివ్య దేశాలలోని 36 ఆలయాలకు త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరిగిన 36 ఆలయాలు:
తంజమామణిక్కోయల్, తిరువాదనూరు, శిరుపులియూర్, తిరువిణ్ణగార్, తిరుక్కణ్ణాపురం, తిరునఱైయూర్, తిరుక్కూడలూర్, తిరుకణ్ణాంగుడి, తిరుకణ్ణామంగై, తిరువెళ్లియాంగుడి, అరిమేయ విణ్ణాగరమ్, తిరుత్తేవనార్ తొగై, వణ్ పురుషోత్తమ్, తిరువక్కావళంబాడి, తిరువెళ్లక్కుళమ్, శ్రీవిల్లిపుత్తూరు, తెన్ మదురై తిరుత్తొలైవిల్ల మంగళమ్, తిరు శిరివర మంగై, తిరుప్పుళింగుడి, తెన్ తిరుప్పేర్, శ్రీవైకుంఠమ్, తిరు వరగుణ మంగై, తిరుక్కుళందై, తిరుక్కురుంగుడి తిరుక్కంచి, తిరువణ్ పరిశారమ్, తిరుచ్చెంకున్ఱూర్, తిరునావాయ్, తిరువణ్ వండూర్,తిరుమోగూర్, తిరు విత్తువక్కోడు, తిరువారన్ విళై తిరునీరగమ్, తిరువెంకా, తిరుకారగమ్, తిరువేంగడమ్.
మరికొన్ని ఆలయాలకు ఈనెల 13న ప్రాణప్రతిష్ట జరగనుంది. ఇప్పటికే అత్యధిక ఆలయాలకు ప్రాణప్రతిష్ట జరగడం వల్ల భక్తులు వేలాదిగా తరలివచ్చి దివ్యదేశాలను దర్శించుకుని స్వామి అమ్మవార్ల అనుగ్రహప్రాతులు అవుతున్నారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీ భగవద్రామానుజ స్వామి విగ్రహాన్ని దర్శించుకుని పరవశించిపోతున్నారు.
గణపతి సచ్ఛిదానంద స్వామి రాక..
మైసూరు దత్త పీఠం అవధూత గణపతి సచ్ఛిదానంద స్వామి 216 అడుగుల శ్రీరామనుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.. గణపతి సచ్ఛిదానంద స్వామికి సమతామూర్తి ప్రాంగణం విశేషాలను వివరించారు. గణపతి సచ్చిదానంద స్వామి అక్కడే కాసేపు భక్తులతో ముచ్చటించారు. అనంతరం యాగశాలకు చేరుకుని శ్రీ లక్ష్మీనారాయణ మహా క్రతువులో పాల్గొన్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని యజ్ఞ ప్రసాదాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామీ… తమకు మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ప్రేమపూర్వకంగా దత్తపీఠాధిపతి వచ్చినందుకు చిన్నజీయర్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీరామ నగరం భవిష్యత్తులో దక్షిణ భారత దేశంలోనే విశిష్ట దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు గణపతి సచ్ఛిదానంద స్వామి. భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అద్భుత అనుభూతికి లోనవుతారనన్నారు గణపతి స్వామి. అనంతరం మైసూరు దత్త పీఠాధిపతిని సత్కరించి శ్రీరామానుజ ప్రతిమను అందజేశారు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.
ప్రముఖుల సందర్శన..
ఇవాళ తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. యాగశాలలో పూజలు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ పూజల్లో పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు..
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవచన మండపంలో పొన్నాల వెంకటేశ్ రామానుజ భజన గీతాలు ఆలపించారు. ఉభయ వేదాంతాచార్యులు కందాడై శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యుల వైభవంపై ప్రవచనం అందించారు. విజయనగరం జిల్లా గంట్యాడ నేత్రవిద్యాలయ విద్యార్థులు శ్రీరామానుజ నూతందాది కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి భావన గీతాలాపన, శ్రీమతి బిందు బృందం కూచిపూడి నృత్యం, సురభి రాయలవారి బృందం రామానుజాచార్యుల నాటకం, వారాహరి నృత్య అకాడమీకి చెందిన ఆదిలక్ష్మి బృందం కూచిపూడి నృత్యం, శ్రీదేవి సిస్టర్స్ గానం, శ్రీమతి జ్వాలాముఖి నృత్యం, యుగంధర్ స్వామీ గానం, చిరంజీవి ఆమోద్ భగవద్గీత శ్లోకాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫణిస్వామి నేతృత్వంలో సహస్ర కూచిపూడి అభినయం ఆకట్టుకుంది. 2 వేల మంది చిన్నారుల కూచిపూడి నృత్యం అందరినీ కట్టిపడేసింది.
Also read:
IRCTC News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 14 నుంచి ఆ సేవలు తిరిగి ప్రారంభం..
IPL 2022 Auction: ధోని స్కెచ్ వేలంలో ఫలించేనా.. వీరిని తిరిగి చెన్నై పొందేనా?