Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్ ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో అన్ని వివరాలు!

Sabarimala Portal Online Services: శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాత్రికుల సౌకర్యార్థం కొత్తగా 'శబరి పోర్టల్' ప్రారంభించింది. దర్శన సమయాలు, వర్చువల్ క్యూ బుకింగ్, వైద్య సేవలు, రవాణా సమాచారం, పోగొట్టుకున్న వస్తువుల ఫిర్యాదులు సహా అన్ని వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.

Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్ ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో అన్ని వివరాలు!
Sabarimala Portal Online Services

Updated on: Nov 07, 2026 | 10:11 PM

Sabarimala Portal Online Services: శబరిమల మండలం-మకరవిళక్కు మహోత్సవానికి తరలివచ్చే కోట్లాది అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, వారి భద్రతకు పెద్దపీట వేస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికులకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని, సేవలను ఒకే వేదికపై అందించేందుకు ‘శబరి పోర్టల్’ (Sabari Portal) పేరుతో కొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రవాణా సదుపాయాలు, అత్యవసర వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు, దర్శన సమాచారం వంటి వివరాలను భక్తులు తమ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచే తెలుసుకోవచ్చు.

డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి శబరిమల యాత్రలోని ప్రతి దశను పర్యవేక్షించడం, యాత్రికులకు అవసరమైన సేవలను వేగంగా అందించడం ఈ పోర్టల్ ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల నుంచి సమాచారాన్ని సేకరించాల్సి వచ్చేది. అయితే కొత్త వ్యవస్థతో ఈ ఇబ్బందులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైన సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో పొందేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు.

ఫిర్యాదులు, తప్పిపోయిన వారి వివరాలకు ప్రత్యేక విభాగం

శబరిమలలో విధులు నిర్వహించే వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను నిజ సమయంలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. యాత్రికులు చేసే ఫిర్యాదులను నేరుగా సంబంధిత అధికారులకు పంపడంతో పాటు, వాటిపై తీసుకున్న చర్యల పురోగతిని కూడా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యాత్ర సమయంలో గుంపులో తప్పిపోయిన వ్యక్తులను గుర్తించేందుకు, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందేందుకు పోర్టల్‌లో ప్రత్యేక విభాగాలను అందుబాటులో ఉంచారు. భక్తుల బృందంలో ఎవరైనా తప్పిపోతే వారి వివరాలను ఈ పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చు. వెంటనే ఆ సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. పోలీసులు చేపట్టిన చర్యలకు సంబంధించిన అప్‌డేట్స్ ఫిర్యాదు చేసిన వ్యక్తికి వాట్సాప్ సందేశాల రూపంలో అందుతాయి. మొబైల్ ఫోన్లు సహా ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్నా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులకు సంబంధించిన ఫోటోలను కూడా జత చేసే సదుపాయం ఉంది.

శబరి మ్యాప్‌తో సమీప సౌకర్యాల గుర్తింపు

ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న శబరి మ్యాప్ యాత్రికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పంప, నిలక్కల్, సన్నిధానం ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, ఆసుపత్రులు, పోలీస్ సేవలు, పార్కింగ్ ప్రదేశాలు, విశ్రాంతి కేంద్రాలు, ఏటీఎంల వివరాలను మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మొబైల్ లొకేషన్ ఆధారంగా తమకు సమీపంలోని సౌకర్యాలను గుర్తించవచ్చు. గూగుల్ మ్యాప్స్ సహాయంతో అక్కడికి చేరుకునే మార్గాన్ని కూడా తెలుసుకోవచ్చు.

దర్శనం, పూజా సమయాల వివరాలు కూడా ఒకే చోట!

దర్శనం కోసం ఎంతసేపు వేచి ఉండాలి? ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? పూజలు ఎప్పుడు నిర్వహిస్తారు? వంటి వివరాలను కూడా పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. దర్శన షెడ్యూల్‌తో పాటు పంపా త్రివేణి స్నానఘట్టం వద్ద నీటి మట్టం, స్నానఘట్టం తెరిచి ఉందా లేదా మూసి ఉందా అనే సమాచారాన్ని కూడా అందిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటనలు, హెచ్చరికలు, యాత్రికులు పాటించాల్సిన సూచనలు, చేయాల్సినవి, చేయకూడనివి, ట్రెక్కింగ్ మార్గాలు, బస్సు, రైలు రవాణా వివరాలు, ఆసుపత్రుల సమాచారం కూడా అందుబాటులో ఉంటాయి.

ఎలా ఉపయోగించుకోవాలంటే?

శబరి పోర్టల్‌ను ఉపయోగించుకోవడానికి ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. sabariportaldcpta.in ) వెబ్‌సైట్‌ను మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఓపెన్ చేసి సేవలను పొందవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ కోసం కూడా ఇందులో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది. ఈ కొత్త డిజిటల్ వ్యవస్థతో అయ్యప్ప భక్తులకు శబరిమల యాత్ర మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us