తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది. పూజలకు శుభకార్యాలకు మాఘ మాసం విశిష్టమైంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మాఘమాసంలో మాఘ శుద్ధ సప్తమిని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు పుట్టిన రోజుగా భావించి అత్యంత ఘనంగా హిందువులు జరుపుకుంటారు. ఈ నెల జనవరి 28 వ తేదీన రథసప్తమి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని సూర్య భగవానుడు పూజలను అందుకుంటున్న అరసవెల్లి సహా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు రథ సప్తమి వేడుకలను రెడీ అవుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తోంది.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాసునికి ఈ రోజున ఏడు వాహనాల సేవలను ఒకే రోజు నిర్వహిస్తుంది టిటిడి పాలకమండలి. తిరుమాడ వీథులలో స్వామి వారు ఏడు వాహనాలలో ఊరేగుతారు ఊరేగుతారు. ఉదయం సూర్య ప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్ర ప్రభ వాహనంతో ముగుస్తుంది..
రథ సప్తమి వేడుకలు ఆ రోజు ఉదయం సూర్యప్రభ వాహనసేవతో ప్రారంభమై చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవ, హనుమంత వాహనసేవ , కల్పవృక్ష వాహన సేవ , సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. రథసప్తమి రోజున ఒకేసారి ఏడు వాహనాలు చూసే అవకాశం ఉండడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుపతికు చేరుకుంటారు. వాహనాలపై ఊరేగుతూ.. భక్తులకు అభయమిచ్చే శ్రీవారిని దర్శించుకుని పులకించి పోతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..