Labh Panchami: లాభ పంచమి ఎప్పుడు? ఈ రోజున ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలే లాభాలట!

Labh Panchami 2026 Date and Significance: దీపావళి తర్వాత వచ్చే లాభ పంచమికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2026లో నవంబర్ 14న ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీ గణేశులను ఎందుకు పూజిస్తారు? పూజా ముహూర్తాలు, ఆచారాలు, వ్యాపారవేత్తలు పాటించే ప్రత్యేక సంప్రదాయాలు ఏమిటో తెలుసుకోండి.

Labh Panchami: లాభ పంచమి ఎప్పుడు? ఈ రోజున ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలే లాభాలట!
Labh Panchami Significance

Updated on: Nov 12, 2026 | 5:04 PM

Labh Panchami 2026 Date and Significance: హిందూ సంప్రదాయంలో దీపావళి తర్వాత వచ్చే పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి పర్వదినాల్లో లాభ పంచమి ఒకటి. ఈ పండుగను ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, వ్యాపార అభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాయి. ఈ రోజున గణేశుడిని, లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, ఖాతా పుస్తకాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. లాభ పంచమిని లాభ్ పంచం, సౌభాగ్య పంచమి, లఖానీ పంచమి అని కూడా పిలుస్తారు. జైన సమాజంలో ఇదే రోజును జ్ఞాన పంచమిగా జరుపుకుంటారు. మరి 2026లో లాభ పంచమి ఎప్పుడు వచ్చింది? పూజకు శుభ ముహూర్తాలు ఏమిటి? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

2026లో లాభ పంచమి ఎప్పుడు?

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి రోజున లాభ పంచమిని జరుపుకుంటారు. 2026లో నవంబర్ 14, శనివారం ఈ పండుగ వచ్చింది. ఉదయ తిథి ప్రకారం అదే రోజు పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

లాభ పంచమి 2026 పూజా ముహూర్తాలు

  • పంచమి తిథి ప్రారంభం: నవంబర్ 13, రాత్రి 8:42 గంటలకు
  • పంచమి తిథి ముగింపు: నవంబర్ 14, రాత్రి 11:23 గంటలకు
  • లక్ష్మీ-గణేశ పూజ ముహూర్తం: ఉదయం 6:43 నుంచి 10:18 గంటల వరకు
  • అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:12 నుంచి 11:56 గంటల వరకు
  • విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1:23 నుంచి 2:07 గంటల వరకు

లాభ పంచమిని ఎందుకు జరుపుకుంటారు?

‘లాభం’ అంటే సంపాదన, పురోగతి అని అర్థం. దీపావళి వేడుకల అనంతరం కొత్త పనులు, వ్యాపారాలను ప్రారంభించడానికి ఈ రోజును శుభప్రదంగా భావిస్తారు. గణేశుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, సంపద, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

లాభ పంచమి ప్రత్యేకతలు

  1. కొత్త వ్యాపారాల ప్రారంభం: దీపావళి సమయంలో వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అనంతరం లాభ పంచమి రోజున దుకాణాలు, కార్యాలయాలను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
  2. ఖాతా పుస్తకాల పూజ: ఈ రోజున చేసే ముఖ్యమైన ఆచారాల్లో చోప్రా పూజ ఒకటి. కొత్త ఖాతా పుస్తకాలపై ‘శుభ్’, ‘లాభ్’ అని రాసి గణేశుడు, లక్ష్మీదేవి ముందు ఉంచి పూజిస్తారు.
  3. లక్ష్మీ గణేశుల ఆరాధన: సంపద, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని, ఆటంకాలు తొలగించి విజయాన్ని ప్రసాదించాలని గణేశుడిని ప్రార్థిస్తారు.
  4. జ్ఞాన పంచమి: జైన సమాజంలో ఈ రోజును జ్ఞాన పంచమిగా జరుపుకుంటారు. ధార్మిక గ్రంథాలు, శాస్త్రాలను పూజించి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు.

లాభ పంచమి రోజు పూజా విధానం

ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి గణేశుడు, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు, పండ్లు, మిఠాయిలు సమర్పించి దీపారాధన చేయాలి. అనంతరం లక్ష్మీదేవి, గణేశుడికి సంబంధించిన మంత్రాలను పఠిస్తూ హారతి ఇవ్వాలి. వ్యాపారవేత్తలు తమ దుకాణాలు, కార్యాలయాల్లో ఖాతా పుస్తకాలు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలను ఉంచి పూజించాలి. కొత్త పనులు విజయవంతం కావాలని ప్రార్థించాలి. ఇలా భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఏడాదంతా సుఖసంతోషాలు, వ్యాపారాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

(Disclaimer: ఈ కథనంలోని సమాచారం మతపరమైన విశ్వాసాలు, సంప్రదాయాలు, పంచాంగ వివరాల ఆధారంగా అందించబడింది. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు, పూజా సమయాల్లో మార్పులు ఉండవచ్చు.)

Loading...
Unable to load recommendations.
Follow Us