Hindu Belief: ఉడుత ఇంటికి వస్తే శుభమా.? అశుభమా..? ఇది తప్పక తెలుసుకోండి

squirrel omens: హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఉడుతను శ్రీరాముని సహచారిగా, లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. ఉడుత ఇంటికి వస్తే సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. ఉడుత కలలో కనిపించినా, శరీరాన్ని తాకినా శుభమే. అయితే, ఇంటి ఆవరణలో ఉడుత మరణించడం అశుభంగా పరిగణించబడుతుంది, ఆర్థిక నష్టాలను సూచిస్తుంది.

Hindu Belief: ఉడుత ఇంటికి వస్తే శుభమా.? అశుభమా..? ఇది తప్పక తెలుసుకోండి
squirrel omens

Updated on: Feb 12, 2026 | 5:44 PM

ఉడుత.. ప్రకృతి అందించిన అందమైన జీవులలో ఒకటి. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఉడతను చూస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అంతేగాక, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి సాయం చేసిన జీవి కావడంతో ఆధ్యాత్మికంగానూ దీనికి మంచి గుర్తింపు ఉంది. ఉడుతా భక్తి సాయం అనేది చాలా సార్లు వినే ఉంటా. అలాంటి ఉడుత మన ఇంటికి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న కాళ్ళు, చిన్న చేతులతో కనిపించే ఉడుత చూడటానికి అందంగా ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. ఉడుతలను అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఉడుతను శ్రీరాముని సహచారిగా పరిగణించడం విశేషం. ఉడుతను చూడటం లేదా తాకడం వల్ల ఒక వ్యక్తి అదృష్టం మారుతుందని నమ్ముతారు. ఉడుతలు మనకు కొన్ని సంకేతాలను అందిస్తాయని చెబుతారు.

ఉడుత ఇంటికి వస్తే.. శుభ సంకేతాలు

మీరు మీ ఇంటి పెరట్లో లేదా పార్కులో తరచుగా ఉడుతలను చూస్తుంటారు. అలాంటి ఉడుత ఇంటికి వస్తే దానిని శుభసూచకంగా పరిగణిస్తారు. ఉడుతను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంటికి సంపద, శ్రేయస్సును తెస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. మీ పెరట్లో ఉడుత కనిపిస్తే త్వరలో మీకు శుభవార్త అందుతుందని అర్థం. ఉడుత ఇంట్లోకి వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటే దానిని మంగళకరంగా భావిస్తారు.

ఉడుతను లక్షి అని పిలిస్తే..

ముఖ్యంగా, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. రోజూ ఒక్క ఉడుత కంటపడితే దానిని లక్ష్మి అని పిలవాలని, అలా పిలవడం ద్వారా లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని చెబుతారు. ఇంట్లో ఉడుత ఉండటం ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సూచిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉడుత కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు. మీ వంటగదిలో ఉడుత కనిపిస్తే, ఇంట్లోని అన్ని కొరతలు తీరుతాయని ఇది సంకేతం.

ఉడుత కనిపించినా.. శుభ ఫలితాలే..

ఉదయం పూట ఉడుత కనిపించడం ఆ రోజంతా మంచిదని అర్థం. తెల్లవారుజామున మీ కలలో ఉడుత కనిపిస్తే, మీకు త్వరలో డబ్బు వస్తుందని సంకేతం. తెల్లవారుజామున ఉడుత ఇంటికి వస్తే ఆ రోజు మీకు శుభవార్త వస్తుందని అర్థం. ఉడుతలు సాధారణంగా ఇంటి చుట్టుపక్కల ఉన్నప్పటికీ, అవి తరచుగా ఇంట్లోకి రావు లేదా మనుషులపై పడవు.

అయితే, మీ ముఖంపై ఉడుత పడితే అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది. ఉడుత మిమ్మల్ని తాకినట్లయితే, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి దూరమైందని నమ్ముతారు. ఒక ఉడుత మీ శరీరాన్ని అధిరోహిస్తే, అది విష్ణువు యొక్క ప్రత్యేక ఆశీర్వాదంగా భావిస్తారు. మీ తలపై ఉడుత పడటం కూడా శుభప్రదమే. ఇది మీపై ధన వర్షం కురుస్తుందని, జీవితంలో ఆనందం లభిస్తుందని, సగంలో నిలిచిన పనులు పూర్తవుతాయని సూచిస్తుంది. ఇంటి లోపల ఉడుత గూడు కట్టుకుంటే అది కూడా శుభప్రదమే, ధన సమస్యలు తీరి సంతోషం కలుగుతుంది.

ఏది అశుభం..?

అదేవిధంగా, ఉడుత గురించి కొన్ని అశుభ సూచనలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో లేదా పెరట్లో ఉడుత చనిపోతే అది అశుభంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా ఆర్థిక నష్టం, కుటుంబ సభ్యులకు అనారోగ్యం సంభవించవచ్చు. చనిపోయిన ఉడుతను మట్టిలో పాతిపెట్టడం ముఖ్యం. ఉడుతలను ఎప్పుడూ కొట్టకూడదు. ఇంటి బయట, ఉదాహరణకు పార్కులో చనిపోయిన ఉడుత గురించి చింతించాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. ఈ విశ్వాసాలన్నీ మన సంస్కృతి, చరిత్ర, వేదాల నుంచి వచ్చినవి మాత్రమే.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)