కొండంత జనం.. 30 గంటల దర్శనం! తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమల కొండపై వేసవి తాకిడికి తోడు భక్తజన సందోహం పోటెత్తింది. గత వారం రోజులుగా పెరిగిన భక్తుల రద్దీతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. "గోవిందా.. గోవిందా.." స్మరణలతో తిరుగిరులు మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది.

కొండంత జనం.. 30 గంటల దర్శనం! తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ
Heavy Rush Of Devotees At Tirumala

Edited By:

Updated on: May 22, 2026 | 8:07 AM

కలియుగ వైకుంఠం తిరుమల కొండపై వేసవి తాకిడికి తోడు భక్తజన సందోహం పోటెత్తింది. గత వారం రోజులుగా పెరిగిన భక్తుల రద్దీతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. “గోవిందా.. గోవిందా..” స్మరణలతో తిరుగిరులు మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్లు శ్రీవారి సేవాసడన్ వరకు బారులు తీరాయి. అయితే పటిష్టమైన టైమ్ మేనేజ్‌మెంట్ ద్వారా సామాన్య భక్తులకు రికార్డు స్థాయిలో వేగంగా దర్శనం కల్పిస్తున్నామని, ప్రతిరోజూ అదనంగా 15 వేల మందికి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.

గత ఐదు రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, మే 16, 17 తేదీల్లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గత ఐదు రోజుల భక్తుల రద్దీ గణాంకాలు ఇలా ఉన్నాయి:

మే 16: 90,011 మంది

మే 17: 91,020 మంది

మే 18: 80,455 మంది

మే 19: 84,412 మంది

మే 20: 86,315 మంది

మరో వైపు గురువారం (మే 21, 2026 ) ఒక్కరోజే 79,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లుగా నమోదైంది.

ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బాటగంగమ్మ సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు, అలాగే ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్ల వద్ద చలువ పందిళ్లు వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు, అదనపు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తుల పాదాలు కాలకుండా నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు.

క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం పాలు, ఉప్మా, పొంగల్.. మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోటా రైస్.. రాత్రి మళ్లీ ఉప్మా, సాంబారన్నం అందిస్తున్నారు. మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా ఎప్పటికప్పుడు తాగునీరు అందిస్తూ, గత ఐదు రోజుల్లోనే దాదాపు 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, మజ్జిగ పంపిణీ చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు క్యూలైన్ల వెంబడి మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అందుబాటులో ఉంచారు.

తిరుమలలో వసతి గదులు పరిమితంగా 7,500 గదులు, 5 యాత్రికుల వసతి సముదాయాలు ఉండటంతో గరిష్టంగా 60 వేల మందికి మాత్రమే వసతి సాధ్యమవుతుంది. గదులు దొరకని భక్తుల కోసం వివిధ పీఏసీలలో 9 వేల లాకర్లను అందుబాటులో ఉంచారు. అలాగే, తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టల్లో క్షురకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. మే 18 నుండి 20 వరకు రోజుకు 43 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా 5 భాషల్లో భక్తులకు దర్శన సమాచారాన్ని అందిస్తూ, రద్దీ దృష్ట్యా రాత్రి వరకు క్యూ లైన్లలోకి రావద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us