ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సహనాన్ని కోల్పోతున్నారు. తలపెట్టిన పని సజావుగా జరగకపోయినా.. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురైనా.. ఇలా ఎన్నో పరిణామాలు వాళ్లను కలత చెందేలా చేస్తున్నాయి. ఏ సమస్యనైనా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆ సమస్య పెద్దదైతే.. కొంతమంది దాన్ని ఎదుర్కోలేరు.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. మరికొందరు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల బాధ నుంచి విముక్తి లభిస్తుందని అనుకుంటే.. అది పొరపాటే.! ఆత్మహత్య చేసుకున్నవారికి ఏం జరుగుతుందన్నది గరుడ పురాణంలో వివరించబడింది. ఆత్మహత్య అనేది నేరమే కాకుండా దేవుడిని అవమానించడమేనని గరుడ పురాణం చెబుతోంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మరణం తర్వాత అత్యంత దారుణమైన స్థితిని ఎదుర్కుంటాడట. మరి అసలు ఆత్మహత్య గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం.!
గరుడ పురాణం ప్రకారం, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ సమతుల్యంగా ఉంటుంది. అలాంటి ఆత్మ తన కాలచక్రం పూర్తయ్యే వరకు రెండో జన్మ లేదా మరే ఇతర స్థానాన్ని పొందలేదు. మరణం తర్వాత కొన్ని ఆత్మలకు 10 లేదా 13 రోజుల్లో.. మరికొన్ని ఆత్మలకు 37 లేదా 40 రోజులలో మరో శరీరం లభిస్తుందని అంటారు. అయితే ఆత్మహత్య లేదా ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఆత్మలకు.. వాటి సమయం పూర్తయ్యే మరో శరీరం లభించదు.
ఏదైనా బలమైన కోరిక నెరవేరకుండా, లేదా తీవ్ర ఒత్తిడి కారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకుని మరణించినట్లయితే.. ఆ వ్యక్తుల ఆత్మలు కొత్త శరీరాన్ని పొందలేవు. కలత చెందిన లేదా సంతృప్తి చెందని ఆత్మలు దెయ్యం, లేదా పిశాచి రూపంలో తిరుగుతుంటాయి. వాటి కాలచక్రం పూర్తయ్యే వరకు ఇలా దిక్కుతోచని స్థితిలోనే కొనసాగుతాయి.
అకాల మరణం చెందిన వ్యక్తుల ఆత్మలు దిక్కుతోచని స్థితిలో తిరుగుతుంటే.. వాటికి మోక్ష మార్గాన్ని ప్రసాదించేలా గరుడ పురాణం కొన్ని సూత్రాలను పేర్కొంటోంది. మరణించినవారి బంధువులు చనిపోయిన ఆత్మకు మోక్షం కలిగించడం కోసం తర్పణం, దానం, ధర్మం, గీతా పారాయణం, పిండ ప్రధానం చేయాలి. అలాగే, మరణించిన వ్యక్తుల కోరికను నెరవేర్చాలి. ఇలా దాదాపు మూడు సంవత్సరాలు చేస్తే.. వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయి. మరో శరీరంలోకి ప్రవేశించే సామర్ద్యాన్ని పొందుతాయి.