
వెండి వస్తువులు: బంగారం కొనలేని వారు వెండి నాణేలు లేదా వెండి పాత్రలను కొనుగోలు చేయవచ్చు. వెండి కూడా సంపదకు, చంద్రుని అనుగ్రహానికి సంకేతం. అందుకే అక్షయ తృతీయ రోజున వెండి, రాగి పాత్రలు లేదా కొత్త వస్త్రాలు కొనుగోలు చేసినా అంతే పుణ్యఫలం లభిస్తుంది.

ధాన్యాలు (బార్లీ లేదా బియ్యం): అక్షయ తృతీయ నాడు ధాన్యాలను ఇంటికి తీసుకురావడం వల్ల ధన ధాన్యాలకు లోటు ఉండదని నమ్ముతారు. ముఖ్యంగా బార్లీ (Barley) కొనుగోలు చేయడం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి బియ్యం తీసుకురావడం కూడా శుభప్రదం. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపంగా, సిరిసంపదలకు చిహ్నంగా పూజిస్తారు. అలాంటి బియ్యాన్ని ఆ రోజు ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుంది.

దక్షిణావర్త శంఖం: ఇంట్లో సిరిసంపదలు ఉండాలంటే ఈ రోజున దక్షిణావర్త శంఖాన్ని కొని పూజగదిలో ఉంచడం శుభప్రదం. ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తి శంఖం ఉంటే వారిపై శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక సంక్షోభాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శంఖం శబ్ధం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసముంటుందని నమ్ముతారు.

కౌరీలు, గోమతి చక్రాలు: సముద్రం నుండి ఉద్భవించిన కౌరీలు (చిన్న గవ్వలు), గోమతి చక్రాలను కొనుగోలు చేసి మహాలక్ష్మి పూజలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ గోమతి చక్రం సంపద , శ్రేయస్సుకి అధిదేవత న లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవికి సమర్పిస్తారు.

మట్టి పాత్రలు: పండితుల ప్రకారం అక్షయ తృతీయ రోజున మట్టి కుండ కొనడం చాలా శుభప్రదం. వేసవి కాలం కాబట్టి, ఈ రోజున కొత్త మట్టి కుండను కొని దానిని నీటితో నింపి దానం చేయడం లేదా ఇంట్లో ఉంచుకోవడం అత్యంత పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్త కుండ కొని, అందులో నీళ్లు నింపడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. జీవితంలో విజయం సాధిస్తారు. మీ కెరీర్‌లో కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఉప్పు: ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు కొత్త ఉప్పు ప్యాకెట్ కొని వంటగదిలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఉప్పును శుక్ర, చంద్రుల కారకంగా పరిగణిస్తారు . ఏ ఇంట్లోనైతే ఉప్పు పాత్ర పూర్తిగా ఖాళీగా ఉంటుందో, ఆ ఇంట్లో ప్రతికూల శక్తి, రాహువు ప్రభావం పెరగడం మొదలై, అది మానసిక ఒత్తిడికి, గృహ కలహాలకు దారితీస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయకు ముందు, ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ తీసుకుని, పాత్రను అంచు వరకు నింపండి. ఆ ఉప్పు పాత్రలో ఐదు లవంగాలను నలిపి వేయండి. ఇలా చేయటం వల్ల దిష్టి పోగొట్టడానికి, ఆర్థిక లాభానికి అడ్డంకులను తొలగిస్తుంది.

దానం ప్రాముఖ్యత: ఈ రోజున వస్తువులు కొనడమే కాదు, నీరు, మజ్జిగ, గొడుగులు లేదా చెప్పులను పేదలకు దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భక్తిశ్రద్ధలతో మీ శక్తికి తగ్గట్టుగా ఏ చిన్న వస్తువు కొన్నా, అది పవిత్రమైన మనసుతో కొంటే అక్షయమైన ఫలితాలను ఇస్తుంది.