తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు.. పండగ.. సీఎం కేసీఆర్‌ కృషికి వారి సహకారం కావాలన్న మంత్రులు

|

Feb 06, 2021 | 6:04 PM

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ''కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు - యాసంగి కొనుగోళ్లు'' అంశాలపై మార్కెట్..

తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు.. పండగ.. సీఎం కేసీఆర్‌ కృషికి వారి సహకారం కావాలన్న మంత్రులు
Follow us on

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ”కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు – యాసంగి కొనుగోళ్లు” అంశాలపై మార్కెట్ కమిటీ కార్యదర్శులు, మార్కెట్ చైర్మన్లు, మార్కెటింగ్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ , క్రీడలు, యువజన శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణ మార్కెటింగ్ శాఖ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రవాహానికి ఎదురొడ్డి నిలిచినప్పుడే మనకు విలువ .. అందులో పడి కొట్టుకపోతే చరిత్ర నుండి మాయమౌతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే వ్యవసాయానికి వన్నె వచ్చిందని మంత్రి తెలిపారు. రైతుకు కేసీఆర్ ఎట్టి పరిస్థితులలోనూ కష్టం రానివ్వరని ఆశాభావం వ్యకం చేశారు. సీఎం కేసీఆర్‌ కృషికి మార్కెట్ చైర్మన్లు, కార్యదర్శుల సహకారం కావాలని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్లకు, మార్కెట్ సిబ్బందికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతుభీమా, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరంటు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి వ్యవసాయ అనుకూల విధానాలతో రాష్ట్రంలో సాగుతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. రూ.లక్షా 15 వేల కోట్ల విలువగల ఉత్పత్తులు రాష్ట్రంలో మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటన్నింటినీ సేకరించే బాధ్యత మార్కెటింగ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులదేనన్నారు.

రాష్ట్రంలో పెరిగిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి రైతులకు న్యాయమైన ధర లభించేవిధంగా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాదిగా చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు నిర్వహించిన సమావేశాలలో వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమావేశాలే అత్యధికం. పెరుగుతున్న ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలన్నది మన ముందున్న బాధ్యత. మార్కెట్ చైర్మన్లు, కార్యదర్శులు వ్యవసాయ, ఉద్యాన శాఖలతో అనుసంధానం కావాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.

కొత్త తరం రైతులను వ్యవసాయంలోకి తెచ్చేందుకు రైతులు, రైతుసంఘం సభ్యులతో మీమీ మార్కెట్ల పరిధిలో సమావేశాలు నిర్వహించుకోవాలి. రైతులకు శిక్షణ ఇప్పించాలి. రైతులు ఇష్టమొచ్చిన పంటలు వేస్తే నష్టపోతారని వారిని జాగృతం చేయాలి. నియంత్రిత సాగుపై నిర్ణయానికి రావడానికి ఆరు నెలలు సమీక్షలు, సమావేశాలు నిర్వహించి చెప్పారు. కేసీఆర్ సూచన మేరకు 10.80 లక్షల ఎకరాలలో రైతులు కందులు వేశారు. నేడు కందులు కనీస మద్దతుధరను మించి రూ.7 వేల పైచిలుకు ధర పలుకుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు.

రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ వారిని చెడగొట్టి రాజకీయం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆముదం, వేరుశనగ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వనపర్తి మార్కెట్ లో క్వింటాలు వేరుశనగ రూ.8300 ధర వచ్చిన విషయం తెలుసుకుని సీఎం కేసీఆర్ ఎంతో సంతోషించారు. రాష్ట్రంలో వేరుశనగ సాగును పెంచాలి. కేవలం 3.5 లక్షల ఎకరాలే వేరుశనగ సాగు చేస్తున్నారు. ఇది 15 – 20 లక్షల ఎకరాలలో సాగుచేసినా మార్కెట్ డిమాండ్ తగ్గదని నిరంజన్‌రెడ్డి చెప్పారు.

ఆయిల్ పామ్, పొద్దు తిరుగుడు, కుసుమలు, నువ్వుల వంటి నూనెగింజల సాగు పెరగాలి. ఏటా రూ.70 వేల కోట్ల వంట నూనెలను మన దేశం దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైతులు పంటలు పండించాలి. రైతులలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులు, మార్కెటింగ్ సిబ్బంది పనిచేయాలని సూచించారు.

ఓ రైతు ముఖ్యమంత్రి అయినందుకు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు మారాయని మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్నారు .. ఈ రోజు అది పండుగ అయిందని చెప్పారు. ఇన్నేండ్లలో మార్కెటింగ్ వ్యవస్థను మార్చిండ్రా ? కొత్త రూపు తెచ్చిండ్రా ? తెలంగాణ వచ్చాక గోదాములు కట్టించారు .. రైతుల పంటకు మద్దు ధర దక్కేలా చేశారని అన్నారు.

ఫార్మ్ హౌస్ అని విమర్శిస్తున్నారు. ఫార్మ్ హౌస్ కాదు అది వ్యవసాయ ప్రయోగశాల అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. – కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు .. ఆయన రైతుల పక్షపాతి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి పాల్గొన్నారు.

 

Read more:

వారి సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ